డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం డౌన్‌ | Dr Reddys Q4 results: PAT down 86 Percent at Rs 221 crore | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం డౌన్‌

May 13 2026 2:06 AM | Updated on May 13 2026 2:06 AM

Dr Reddys Q4 results: PAT down 86 Percent at Rs 221 crore

క్యూ4లో రూ. 221 కోట్లు 

షేరుకి రూ. 8 డివిడెండ్‌

న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్‌ రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 86 శాతం క్షీణించి రూ. 221 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా ఉత్తర అమెరికా జనరిక్స్‌ అమ్మకాలు నీరసించడం ప్రభావం చూపింది. 2024–25 ఇదే కాలంలో రూ. 1,587 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 8 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 8,528 కోట్ల నుంచి రూ. 7,546 కోట్లకు బలహీనపడింది.

ఉత్తర అమెరికా జనరిక్స్‌ విభాగం ఆదాయం 51 శాతం వెనకడుగుతో రూ. 1,756 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 3,559 కోట్లుగా నమోదైంది. అయితే దేశీ జనరిక్స్‌ విక్రయాలు 20 శాతం వృద్ధితో రూ. 1,566 కోట్లను అధిగమించాయి. అంతక్రితం క్యూ4లో ఇవి రూ. 1,305 కోట్లుకాగా.. యూరప్‌ బిజినెస్‌ 14 శాతం ఎగసి రూ. 1,452 కోట్లను తాకింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు సైతం రూ. 7,051 కోట్ల నుంచి రూ. 7,827 కోట్లకు పెరిగాయి.  

పూర్తి ఏడాదికి 
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి డాక్టర్‌ రెడ్డీస్‌ నికర లాభం రూ. 5,725 కోట్ల నుంచి రూ. 4,158 కోట్లకు క్షీణించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 32,644 కోట్ల నుంచి రూ. 33,700 కోట్లకు బలపడింది. లెనాలిడోమైడ్‌ అమ్మకాలు తగ్గడానికితోడు.. అనూహ్య లాభాలు లేకపోవడం ప్రభావం చూపినట్లు కంపెనీ సహచైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్‌ పేర్కొన్నారు. అయితే బ్రాండెడ్‌ బిజినెస్, కరెన్సీ సానుకూలతలు కొంతమేర ప్రభావాన్ని తగ్గించినట్లు తెలియజేశారు. 
ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 1 శాతం క్షీణించి రూ. 1,270 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement