సీఎన్‌జీ వాహనాలకు డిమాండ్‌..

Demand for CNG vehicles up - Sakshi

హ్యుందాయ్‌ విక్రయాలు 58 శాతం అప్‌

మారుతీలో 1 లక్ష పైగా ఆర్డర్లు పెండింగ్‌లో...

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ రేట్లు ఆకాశాన్ని తాకుతుండటంతో వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ వాహనాల వైపు చూస్తున్నారు. దీంతో, వాటితో పోలిస్తే చౌక ఇంధనమైన సీఎన్‌జీతో (కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) నడిచే వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ మొత్తం విక్రయాల్లో సీఎన్‌జీ వాహనాల వాటా దాదాపు అయిదో వంతుకు చేరింది. సరఫరాపరమైన సమస్యలు లేకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో డీజిల్‌ వాహన విక్రయాల గరిష్ట స్థాయిని (4,74,953) సీఎన్‌జీ విభాగం దాటేస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం 1,30,000 పైచిలుకు సీఎన్‌జీ వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఎర్టిగా మోడల్‌ కోసం 8–9 నెలల పైగా వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటోందని సంస్థ వర్గాలు తెలిపాయి. మరోవైపు, కొరియన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుందాయ్‌ అమ్మకాల్లో కూడా ఇదే ధోరణి నెలకొంది. ఈ ఏడాది సగటున నెలవారీగా చూస్తే సీఎన్‌జీ వాహనాల అమ్మకాలు 58 శాతం పెరిగాయి. రాబోయే నెలల్లోనూ ఇదే తీరు కొనసాగవచ్చని సంస్థ ఆశిస్తోంది. గతేడాది మొత్తం మీద 37,584 సీఎన్‌జీ వాహనాలను అమ్మిన హ్యుందాయ్‌ ఈ ఏడాది తొలి అయిదు నెలల్లో ఇప్పటికే 24,730 పైగా సీఎన్‌జీ వాహనాలను విక్రయించింది.  

మూడు దిగ్గజాలు..
గతేడాది ఆగస్టులో జరిగిన భారతీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ 61వ వార్షిక సదస్సు సందర్భంగా.. డీజిల్‌ వాహనాలను తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధనాల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితన్‌ గడ్కరీ సూచించారు. తద్వారా ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. తదనుగుణంగానే దేశీ ఆటొమొబైల్‌ సంస్థలు తమ వంతు కసరత్తు చేస్తున్నాయి. 

ప్రస్తుతం మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్‌ కలిసి సీఎన్‌జీకి సంబంధించి 14 వాహనాలను అందిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమవ్యాప్తంగా సీఎన్‌జీ వాహన విక్రయాలు 2,61,000 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటర్స్‌ ఈ ఏడాది తొలినాళ్లలోనే ఈ విభాగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే టిగోర్, టియాగో వాహనాలకు సంబంధించి ఈ వేరియంట్‌ అమ్మకాలు 52 శాతానికి చేరినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. తమ మొత్తం పోర్ట్‌ఫోలియోలో సీఎన్‌జీ వాహన శ్రేణి వాటా 10 శాతం దాకా ఉంటుందని వివరించాయి.

నిర్వహణ వ్యయాలు తక్కువ..
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే సీఎన్‌జీ వాహనాలను నడిపే వ్యయాలు తక్కువగా ఉంటున్నాయి. ద్రవ ఇంధనాలతో నడిచే వాహనాలకు సంబంధించిన ఖర్చు ప్రతి కిలోమీటరుకు రూ. 5.30–5.45గా ఉంటోంది. అదే సీఎన్‌జీ వాహనాల వ్యయం అందులో సగానికన్నా తక్కువగా ప్రతి కిలోమీటరుకు రూ. 2.1–2.2 స్థాయిలో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు కూడా ఇంధన భారాన్ని తగ్గించుకునే దిశగా సీఎన్‌జీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సీఎన్‌జీ డిస్ట్రిబ్యూషన్‌ అవుట్‌లెట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 3–4 ఏళ్ల క్రితం 1,400 అవుట్‌లెట్లు ఉండగా ప్రస్తుతం 3,700కు చేరిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top