ఆన్‌లైన్ రిటైల్ మాయాజాలం | Dark Side of Online Retail How Small Businesses Are Struggling | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ రిటైల్ మాయాజాలం

May 22 2026 12:35 PM | Updated on May 22 2026 7:04 PM

Dark Side of Online Retail How Small Businesses Are Struggling

దేశీయ ఆన్‌లైన్ రిటైల్ రంగంలో చోటుచేసుకుంటున్న విపరీత పరిణామాలు, నకిలీ ఉత్పత్తుల అక్రమ రవాణా, అడ్డగోలు ధరల తగ్గింపు (ప్రిడేటరీ ప్రైసింగ్‌) విధానాలు సాంప్రదాయ చిరు వ్యాపారుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే లక్షలాది మంది జీవనోపాధి దెబ్బతినడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి, వినియోగదారుల నమ్మకానికి గండి పడుతుందని నిపుణులు, విధానకర్తలు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌లో గురువారం ‘ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఫ్రాయ్‌)-తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో ‘ఆధునిక మార్కెట్లలో అక్రమ వ్యాపారాల నిరోధం’ అనే అంశంపై ఉన్నత స్థాయి సదస్సు నిర్వహించారు. తెలంగాణవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రిటైలర్లకు ప్రాతినిధ్యం వహిస్తూ 10 లక్షల మందికి పైగా వ్యాపారుల జీవనోపాధి కోసం పోరాడుతున్న ఫ్రాయ్‌ ఈ వేదికపై పలు కీలక అంశాలను లేవనెత్తింది.

ఈ-కామర్స్, క్విక్ కామర్స్ చాటున ‘నకిలీ’ల దందా

నిమిషాల వ్యవధిలోనే వస్తువులను చేరవేసే ‘క్విక్ కామర్స్’, ‘ఈ-కామర్స్’ ప్లాట్‌ఫామ్‌లు నేడు మార్కెట్‌ను శాసిస్తున్నాయి. నిత్యావసరాలు, కిరాణా సామాగ్రి, సౌందర్య సాధనాల నుంచి మొదలుకొని వేల రూపాయల విలువైన ప్రీమియం మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నీ నిమిషాల్లో ఇంటికి వస్తున్నాయి. అయితే, ఇదే వేగవంతమైన డెలివరీ వ్యవస్థ అక్రమ, నిషేధిత, నకిలీ ఉత్పత్తుల సరఫరాకు కీలకంగా మారుతోందని వ్యాపార సంఘాలు ఆరోపించాయి.

భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్ పేరుతో వినియోగదారులను ఆకర్షిస్తూ, క్వాలిటీ కంటే తక్కువ ధరకే ప్రాధాన్యత ఇచ్చేలా మార్కెట్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. బలహీనమైన పర్యవేక్షణ వ్యవస్థల వల్ల నకిలీ వస్తువులు సులభంగా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయని రిటైలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

సామాజిక సంక్షోభంగా మార్కెట్ అసమతుల్యత

రోజుకు 14 నుంచి 18 గంటల పాటు కష్టపడుతూ నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం చేసే స్థానిక కిరాణా, చిరు వ్యాపారులు ఈ అడ్డగోలు పోటీని తట్టుకోలేకపోతున్నారు. ఇది కేవలం వ్యాపార నష్టానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, లక్షలాది కుటుంబాల మనుగడకు సంబంధించిన సామాజిక సమస్య అని సదస్సులో నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతికతను స్వాగతిస్తున్నప్పటికీ మార్కెట్ పోటీ అనేది పారదర్శకంగా, అందరికీ సమాన అవకాశాలు కల్పించేదిగా ఉండాలని స్పష్టం చేశారు.

ప్రముఖుల అభిప్రాయాలు

తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

‘అక్రమ వ్యాపారాలు, అడ్డగోలు మార్కెట్ విధానాలు ప్రామాణికంగా వ్యాపారం చేసే చిరు వ్యాపారులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. నకిలీ వస్తువుల నెట్‌వర్క్ వల్ల వినియోగదారుల్లో నమ్మకం సడలుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. అక్రమ నెట్‌వర్క్‌లపై సమన్వయంతో చర్యలు తీసుకుంటూ వ్యాపారుల హక్కులను కాపాడాలి’ అని తెలంగాణ రాష్ట్ర మైనారిటీల కమిషన్ ఛైర్మన్‌ తారిఖ్ అన్సారీ అన్నారు.

వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి

‘నకిలీ ఉత్పత్తుల చెలామణి అనేది కేవలం ఆర్థిక నష్టమే కాదు, ప్రజారోగ్యానికి, భద్రతకు కూడా పెను ముప్పు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో సైబర్ రిస్క్‌లు, నకిలీ సరఫరా గొలుసులపై అవగాహన లోపించింది. భారీ డిస్కౌంట్లకు ఆకర్షితులై మోసపోవద్దు. దశాబ్దాలుగా నమ్మకమైన సేవలు అందిస్తున్న స్థానిక చిరు వ్యాపారుల పాత్ర ఆర్థిక వ్యవస్థలో కీలకం. అక్రమ వ్యాపారాల అడ్డుకట్టకు ప్రజలు, అధికారులు సమన్వయంతో ముందడుగు వేయాలి’ అని హైదరాబాద్ సెంట్రల్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఆర్.సంజయ్ కుమార్ అన్నారు.

సాంప్రదాయ వ్యాపార సంస్కృతికే ముప్పు

‘స్థానిక కిరాణా దుకాణాలు కేవలం వ్యాపార కేంద్రాలు కావు. భారతీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక. నేడు క్విక్ కామర్స్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల దూకుడు, అడ్డగోలు ధరల తగ్గింపు విధానాలు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. చిన్న వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే తరతరాలుగా స్వయం ఉపాధితో బతుకుతున్న కోట్లాది కుటుంబాల సాంప్రదాయ వ్యాపార సంస్కృతి నాశనమయ్యే ప్రమాదం ఉంది’ అని ఫ్రాయ్‌ 
వైస్ ప్రెసిడెంట్ (ఆల్ ఇండియా ఫ్రాయ్‌), ప్రెసిడెంట్ (తెలంగాణ చాప్టర్, ఫ్రాయ్‌) మహమ్మద్ సలావుద్దీన్ దఖ్నీ అన్నారు.

ఇదీ చదవండి: బంగారం ధరలు కాస్త కూల్‌!

Advertisement
 
Advertisement
Advertisement