క్రెడిట్‌ సూసీకి ‘స్విస్‌ బ్యాంక్‌’ భరోసా

Credit Suisse to borrow nearly 54 billion dollers from Swiss Central Bank - Sakshi

54 బిలియన్‌ డాలర్ల రుణానికి ఓకే   

బ్యాంకు షేర్లు రయ్‌

న్యూఢిల్లీ: ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న క్రెడిట్‌ సూసీకి స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంకు అండగా నిల్చింది. వ్యవస్థాగతంగా కీలకమైన బ్యాంకుపై ఇన్వెస్టర్లు, డిపాజిటర్లలో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు, దానిపై నమ్మకాన్ని కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా 54 బిలియన్‌ డాలర్ల మేర రుణాన్ని అందించేందుకు అంగీకరించింది. క్రెడిట్‌ సూసీ గురువారం ఈ విషయం వెల్లడించింది. దీంతో బ్యాంకు షేరు ఒక దశలో ఏకంగా 33% ఎగిసి 2.17 స్విస్‌ ఫ్రాంకులకు (1 స్విస్‌ ఫ్రాంకు సుమారు రూ. 89) పెరిగింది. అటు యూరప్‌ బ్యాంకింగ్‌ షేర్లు కూడా ఒక మోస్తరుగా పెరిగాయి.

మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఇన్వెస్టరు నిరాకరించారన్న వార్తలతో క్రెడిట్‌ సూసీ షేరు బుధవారం 30% కుప్పకూలిన సంగతి తెలిసిందే. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు (ఎస్‌వీబీ, సిగ్నేచర్‌) మూతబడటం, క్రెడిట్‌ సూసీ ఆర్థిక పరిస్థితిపై నీలినీడలు కమ్ముకోవడం తదితర పరిణామాలతో అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ సంక్షోభం ముంచుకొస్తోందన్న ఆందోళన నెలకొంది. అయితే, ఈ భయాలను తొలగించేందుకు, అంతర్జాతీయంగా కీలక బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న క్రెడిట్‌ సూసీని నిలబెట్టేందుకు స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ రంగంలోకి దిగింది. మూలధనం, లిక్విడిటీపరమైన నిబంధనలకు అనుగుణంగా క్రెడిట్‌ సూసీ ఉంటే బ్యాంక్‌కు అవసరమైన తోడ్పాటు అందిస్తామని ప్రకటించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top