
కంపెనీలు, డీలర్లు, రిటైలర్ల వద్ద పెద్ద ఎత్తున నిల్వలు
రేట్లు తగ్గించి విక్రయించే యోచనలో ఎఫ్‌ఎంసీజీ సంస్థలు
కొత్త రేట్లతో ఉత్పత్తులు రాక వచ్చే నెలలోనే
న్యూఢిల్లీ: తగ్గిన ధరలపై ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి కొంత సమయం పట్టేట్టు ఉంది. వచ్చే నెల ఆరంభం లేదా మధ్య నాటికి ఈ ఉత్పత్తులు మార్కెట్‌కు చేరుకుంటాయని గోద్రేజ్ కన్జ్యూమర్ సహా పలు ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. కానీ, ఇప్పటికే కంపెనీలు, డీలర్లు, రిటైల్ స్టోర్లలో పెద్ద ఎత్తున ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయి.
ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. పాత స్టాక్‌ను ఎలా విక్రయించాలా? అన్న ఆలోచనలో పడ్డాయి. పాత ఎంఆర్‌పీ (గరిష్ట చిల్లర విక్రయ ధర)పై తగ్గింపు రేట్లతో ఈ నెల 22 తర్వాత కూడా వాటిని విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందన్న ఆశతో ఉన్నాయి. పాత స్టాక్ ఖాళీ అయి, కొత్త స్టాక్ మార్కెట్లోకి వచ్చే వరకు కొన్ని అవాంతరాలు ఎదుర్కోక తప్పేట్టు లేదని భావిస్తున్నాయి.
ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది ప్రతి సంస్థ ఆలోచిస్తోందని ఇమామీ వైస్ చైర్మన్, ఎండీ హర్ష వర్ధన్ అగర్వాల్ తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నట్టు చెప్పారు. అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా ఎంఆర్‌పీలను మార్చడం దిశగా పనిచేస్తున్నట్టు తెలిపారు. దీన్ని ఎదుర్కోవడంపై ఒక ప్రణాళికతో ముందుకు వస్తామని ప్రకటించారు. జీఎస్‌టీలో 12, 28 శాతం రేట్లను ఎత్తివేసి, ఇందులోని వస్తువులను 5, 18% శ్లాబుల్లోకి మార్చడం తెలిసిందే. ఈ రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి.
స్వల్పకాలంలో ఇబ్బందులు తప్పవు..
అధిక టారిఫ్‌ల్లోని ఉత్పత్తులను 5 శాతం కిందకు తీసుకురాడం వల్ల స్వల్పకాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని గోద్రేజ్ కన్జ్యూమర్ ఎండీ, సీఈవో సు«దీర్ సీతాపతి చెప్పారు. డీలర్లు, కంపెనీల వద్ద అధిక ఎంఆర్‌పీలతో ఉత్పత్తుల నిల్వలు ఉన్నట్టు చెప్పారు. కనుక కొత్త ఎంఆర్‌పీలతో కూడిన ఉత్పత్తులు వినియోగదారులను చేరుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. పాత స్టాక్‌పై తగ్గింపు ఇస్తే అది నేరుగా వినియోగదారులకు బదిలీ అవుతుందన్న గ్యారంటీ లేదన్నారు.
స్పష్టత కోసం చూస్తున్నాం..
కొత్త జీఎస్‌టీ రేట్ల అమలు మార్గదర్శకాల కోసం పరిశ్రమ వేచి చూస్తున్నట్టు పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించామని, వెంటనే కొత్త రేట్లకు మారిపోవాలా లేక కొత సమయం ఇస్తారా? అన్నది తెలుసుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటికే పాత ధరలతో ఉన్న నిల్వల విషయంలో ఒక్కో కంపెనీ భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులతో పోల్చినప్పుడు ఆహారోత్పత్తుల మన్నిక (షెల్ప్ లైఫ్/నిల్వ కాలం) తక్కువగా ఉంటుందన్నారు. ఏం చేయాలన్నది అంతా ప్రభుత్వ మార్గదర్శకాలపైనే ఆధారపడి ఉంటుందంటూ, ఇవి త్వరలో వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.
ముందే తగ్గిస్తాం..
తమ స్టోర్లలో ఉన్న ఉత్పత్తుల ధరల లేబుళ్లను మార్చబోమని, దీనికి బదులు తుది బిల్లు మొత్తంపై తగ్గింపు ఇస్తామని వీ–మార్ట్ రిటైల్ చైర్మన్, ఎండీ లలిత్ అగర్వాల్ ప్రకటించారు. ప్రభుత్వం జీఎస్‌టీలో కల్పించిన ఉపశమనం మేర బిల్లులో తగ్గింపు ఉంటుందన్నారు. కంపెనీ స్టోర్లలో కస్టమర్లకు తెలిసేలా బోర్డులు పెట్టినట్టు చెప్పారు. ఏసీలు, ఇతర కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలోని బ్లూస్టార్ సైతం సెపె్టంబర్ 22 తర్వాత కస్టమర్లకు తగ్గింపులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.