23,000 క్యాంపస్‌ ఉద్యోగాలకు రెడీ

Cognizant may hire 23000 campus placements - Sakshi

2021లో రిక్రూట్‌మెంట్‌పై కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌

ఈ ఏడాది(2020)లో 17,000 మందికి ఉద్యోగాలు

అధిక శాతం భారత్‌ నుంచే: కాగ్నిజెంట్‌ ఎండీ రాజేష్‌ నంబియార్‌

ముంబై, సాక్షి: వచ్చే ఏడాది అంటే 2021లో 23,000 మందిని క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్లు కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ తెలియజేసింది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో అధిక శాతం భారత్‌కే అవకాశముంటుందని కాగ్నిజెంట్‌ ఇండియా ఎండీ రాజేష్‌ నంబియార్‌ తాజాగా పేర్కొన్నారు. అక్టోబర్‌లో కాగ్నిజెంట్‌ బోర్డు సభ్యులైన నంబియార్‌ సీఈవో బ్రియాన్‌ హంఫ్రీస్‌ నిర్దేశనలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా సుమారు 17,000 మందిని ఎంపిక చేసుకున్నట్లు నంబియార్‌ తెలియజేశారు. 2016 నుంచీ చూస్తే ఇవి అత్యధికంకాగా.. వీటిలో సింహభాగం భారత్‌ నుంచే ఎంపికలు జరిగినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. చదవండి: (బ్యాంకింగ్‌: డిజిటల్‌ సేవల్లో సవాళ్లేంటి?)

పలు బాధ్యతలు
కాగ్నిజెంట్‌ తరఫున దేశీయంగా 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని పర్యవేక్షించే ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి సైతం నంబియార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  కాగా.. దేశీ ప్రభుత్వ ఏజెన్సీలు, పాలసీ సంస్థలతో కాగ్నిజెంట్‌కున్న ఒప్పందాలను మరింత మెరుగు పరచవలసిన బాధ్యత నంబియార్‌పై ఉన్నట్లు పరిశ్రమ నిపుణులు ఈ సందర్భంగా తెలియజేశారు. దేశీయంగా కంపెనీ కార్యకలాపాలను మరింత పటిష్టపరచడం, నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా యూనివర్శిటీలతో భాగస్వామ్యలు ఏర్పాటు చేసుకోవడం వంటి లక్ష్యాలను నంబియార్‌ సాధించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బాటలో ప్రభుత్వ ఏజెన్సీలతోపాటు, నాస్కామ్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తదితర పరిశ్రమ సంబంధిత సంస్థలతోనూ కలసి పనిచేయవలసి ఉంటుందని సాఫ్ట్‌వేర్‌ రంగ నిపుణులు వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top