కోడింగ్‌ ఒక్కటే సరిపోదు! | Coding Why Physics Could Be Key Skill for AI Generation NVIDIA CEO Jensen Huang | Sakshi
Sakshi News home page

కోడింగ్‌ ఒక్కటే సరిపోదు!

May 6 2026 12:17 PM | Updated on May 6 2026 12:56 PM

Coding Why Physics Could Be Key Skill for AI Generation NVIDIA CEO Jensen Huang

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో విద్యార్థులు, యువ నిపుణులు ఏయే నైపుణ్యాలపై దృష్టి పెట్టాలనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ చేసిన వ్యాఖ్యలు సాంకేతిక ప్రపంచంలో చర్చకు దారితీశాయి. ఒకవేళ తాను ఇప్పుడు విద్యార్థిని అయితే కోడింగ్‌తో పాటు భౌతిక శాస్త్రానికి (ఫిజిక్స్‌) అత్యధిక ప్రాధాన్యతనిస్తానని ఆయన స్పష్టం చేశారు.

కోడింగ్ మాత్రమే సరిపోదు

సాంకేతిక రంగంలో దశాబ్దాలుగా కోడింగ్‌ను అత్యంత కీలకమైన నైపుణ్యంగా పరిగణిస్తున్నారు. అయితే, ఏఐ వ్యవస్థలు కేవలం డిజిటల్ డేటాను ప్రాసెస్ చేసే స్థాయి నుంచి భౌతిక ప్రపంచంతో నేరుగా కార్యకలాపాలు సాగించే స్థాయికి చేరుకుంటున్నాయని హువాంగ్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నేను బహుశా భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాడిని’ అని పేర్కొన్న హువాంగ్, ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలిపే ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడం కోడింగ్ చేయడం కంటే ముఖ్యమని ఉద్ఘాటించారు. తదుపరి తరం ఆవిష్కరణలు కేవలం సాఫ్ట్‌వేర్ నైపుణ్యాల మీద కాకుండా భౌతిక శాస్త్రం, గణితంపై ఉన్న లోతైన అవగాహన మీద ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

ఎందుకు ఈ మార్పు?

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ‘ఫిజికల్ ఏఐ’ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఏఐ వ్యవస్థలు ఇప్పుడు రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి రియల్‌ వరల్డ్‌ అప్లికేషన్లలో కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హువాంగ్ చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో డెవలపర్లు, ఇంజినీర్లకు ఫిజిక్స్‌ విషయాలపై అవగాహన తప్పనిసరి. కోడింగ్ అనేది ఒక పనిని చేయించడానికి ఉపయోగపడే సాధనం మాత్రమేనని, కానీ యంత్రాలు సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేయాలంటే అవి పనిచేసే భౌతిక ప్రపంచంపై పూర్తి అవగాహన ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.

ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Advertisement
 
Advertisement
Advertisement