‘ఉనికిలోలేని సమస్యలు సృష్టిస్తున్నారు’ | CEO Fires Entire HR Department Shocking Corporate Shakeup at Bolt | Sakshi
Sakshi News home page

‘ఉనికిలోలేని సమస్యలు సృష్టిస్తున్నారు’

May 22 2026 1:17 PM | Updated on May 22 2026 6:38 PM

CEO Fires Entire HR Department Shocking Corporate Shakeup at Bolt

మొత్తం హెచ్‌ఆర్‌ విభాగాన్ని లేపేసిన సీఈఓ

కార్పొరేట్ ప్రపంచంలో సాధారణంగా ఉద్యోగుల తొలగింపులు, క్రమశిక్షణా చర్యలు అన్నీ హ్యూమన్‌ రిసోర్సెస్ (హెచ్‌ఆర్‌) విభాగం పర్యవేక్షణలోనే జరుగుతుంటాయి. కానీ, ఒక ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలో మాత్రం సీఈఓ ఏకంగా మొత్తం హెచ్‌ఆర్ విభాగానికే షాక్ ఇచ్చారు. ఉనికిలో లేని సమస్యలను సృష్టిస్తూ, కంపెనీ ప్రగతిని అడ్డుకుంటున్నారనే సంచలన ఆరోపణతో ఆ విభాగంలోని సిబ్బంది మొత్తాన్ని ఇంటికి పంపించేశాడు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ పేమెంట్స్ ఫిన్‌టెక్ స్టార్టప్ ‘బోల్ట్’లో జరిగిన ఈ ఊహించని పరిణామం ప్రస్తుతం కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బోల్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ర్యాన్ బ్రెస్లో స్పష్టం చేశారు.

11 బిలియన్ల నుంచి 300 మిలియన్లకు పతనం!

ఒకప్పుడు ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్‌గా వెలిగిన ‘బోల్ట్’ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కంపెనీ మార్కెట్ విలువ క్షీణించడమే ఈ భారీ మార్పులకు ప్రధాన కారణం. 2022 నాటికి కంపెనీ విలువ గరిష్ఠంగా సుమారు 11 బిలియన్‌ డాలర్లు (రూ.91,000 కోట్లకు పైగా)కు చేరింది. అయితే ప్రస్తుత మార్కెట్ విలువ కేవలం 300 మిలియన్‌ డాలర్లు (దాదాపు 97% పతనం)గా ఉంది. ఈ తీవ్ర పతనం నుంచి కంపెనీని గట్టెక్కించేందుకు సీఈఓ ర్యాన్ బ్రెస్లో కఠిన సంస్కరణలను ప్రతిపాదించారు.

ఉనికిలో లేని సమస్యలు

కంపెనీ నుంచి హెచ్‌ఆర్ విభాగాన్ని పూర్తిగా తొలగించడంపై ర్యాన్ బ్రెస్లో ఘాటుగా స్పందించారు. హెచ్‌ఆర్ బృందం లేనిపోని సమస్యలను సృష్టించిందని, విచిత్రంగా ఆ విభాగాన్ని తొలగించిన మరుక్షణమే ఆ సమస్యలన్నీ మాయమైపోయాయని ఆయన పేర్కొన్నారు. హెచ్‌ఆర్ విభాగానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు బోల్ట్ సంస్థ కేవలం ఒక చిన్న పీపుల్ ఆపరేషన్స్ బృందాన్ని మాత్రమే నిర్వహిస్తోందని ఫార్చ్యూన్ నివేదిక వెల్లడించింది.

చర్చనీయాంశంగా మారిన సీఈఓ వ్యాఖ్యలు

‘కంపెనీ వృద్ధి దశలో ఉన్నప్పుడు ఉద్యోగులు చాలా సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. దీనివల్ల ఉత్పాదకత దారుణంగా పడిపోయింది. సంస్థ అంతటా తాము దేనికైనా అర్హులమనే భావన పెరిగిపోయింది. నైపుణ్యం ఉన్నట్లు నటించేవారే కానీ, వాస్తవానికి కష్టపడి పనిచేసేవారు కాదు. నేను మొదట పోరాడాల్సింది ఈ అసమర్థ సంస్కృతిపైనే. అందుకే చాలా మందికి లేఆఫ్స్‌ ఇచ్చాం’ అని బోల్ట్‌ సీఈఓ ర్యాన్ బ్రెస్లో చెప్పారు.

లీడర్‌షిప్ టీమ్ కూడా అవుట్!

కంపెనీని తిరిగి పాత స్టార్టప్ తరహా వేగవంతమైన పని సంస్కృతిలోకి తీసుకురావడానికి బ్రెస్లో పాత యాజమాన్యం నియమించిన ఉద్యోగులకు 60 రోజుల గడువు ఇచ్చారు. కొత్తగా మారుతున్న ఏఐ ఆధారిత నిర్మాణానికి అనుగుణంగా మారాలని సూచించారు. అయితే, ఈ పరివర్తనలో దాదాపు 99 శాతం మంది ఉద్యోగులు, మేనేజర్లు విఫలమయ్యారని బ్రెస్లో వెల్లడించారు. క్షేత్రస్థాయిలో కష్టపడకుండా, భారీగా డబ్బులు ఖర్చు పెట్టే కార్పొరేట్ లగ్జరీకి వారు అలవాటు పడ్డారని చెప్పారు. కానీ ఇప్పుడు కంపెనీ దగ్గర అంత బడ్జెట్ లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో దాదాపు మొత్తం లీడర్‌షిప్ బృందాన్ని తొలగించి స్క్రాచ్ నుంచి కొత్త యాజమాన్యాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బంగారం ధరలు కాస్త కూల్‌!

Advertisement
 
Advertisement
Advertisement