
ప్రభుత్వం టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఆన్‌లైన్ సేవల్లో ప్రైవేటు కంపెనీలతో పోటీ పడుతోంది. ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్, డేటా ప్లాన్లతో ప్రైవేటు సంస్థలకు దీటుగా దూసుకెళుతున్న బీఎస్ఎన్ఎల్ (BSNL) మరో ముందడుగు వేయబోతోంది. వినియోగదారుల కోసం త్వరలో కోసం కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతోంది.
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆర్థిక లావేదేవీలు, బిల్లుల చెల్లింపుల కోసం ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి ప్రైవేటు డిజిటల్ యాప్‌లను ఎక్కువగా వాడుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కూడా త్వరలోనే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలను ప్రారంభించనుంది. బీఎస్ఎన్ఎల్ పే పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (భీమ్) యూపీఐ ఆధారంగా బీఎస్ఎన్ఎల్ పే (BSNL Pay) సేవలను వినియోగించుకునేలా దీన్ని రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దీపావళి నాటికి ప్రారంభం!
బీఎస్ఎన్ఎల్ పే సేవలు వినియోగదారులకు దీపావళి (Diwali) నాటికి అందుబాటులోకి వస్తాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ పే అనేది ప్రత్యేకమైన యాప్ కాదు. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌లో భాగంగానే ఇది ఉంటుంది. భీమ్ యూపీఐ ద్వారా దీని సేవలను యూజర్లు వినియోగించుకోవచ్చు.
ఎలాంటి సేవలు అందిస్తుంది?
ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం (Paytm) మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ పే ద్వారా అన్ని రకాల ఆన్‌లైన్ చెల్లింపులు చేయగలుగుతారు. సెల్ఫ్ కేర్ యాప్ వినియోగదారులు సులువుగా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. యూజర్లకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందించడంతో పాటు, దేశంలో వేగంగా విస్తరిస్తున్న యూపీఐ చెల్లింపుల మార్కెట్‌లో తమ దైన ముద్ర వేయాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ పే సేవలు అందుబాటులోకి వస్తే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి ప్రైవేటు డిజిటల్ యాప్‌లకు గట్టి పోటీ ఎదురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.