
పాలప్యాకెట్ నుంచి పిజా వరకు ఏం కొన్నాలన్నా ఫోన్‌తో క్యుఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తున్నాం. జేబులో రూపాయి లేకపోయినా యూపీఐ ద్వారా కావాల్సినవి కొనేస్తున్నాం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అందుబాటులోకి వచ్చాక ఆర్థిక లావాదేవీలు చకచకా జరిగిపోతున్నాయి. ఎటువంటి సర్వీసు చార్జి లేకుండానే చెల్లింపులు జరుగుతుండడంతో మనోళ్లు యూపీఐ సేవలను విరివిగా వాడేస్తున్నారు. దీంతో మన దేశంలో ప్రతిరోజు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి.
రూపాయి నుంచి లక్ష వరకు ఎటువంటి చార్జీలు లేకుండానే యూపీఐ ద్వారా నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్ వంటి డిజిటల్ యాప్‌ల సేవలను యూపీఐ (UPI) కోసం ఎక్కువగా వాడుతున్నారు. వినియోగదారుల నుంచి ఎటువంటి రుసుములు వసూలు చేయకుండానే ఈ కంపెనీలు సర్వీస్ అందిస్తున్నాయి. నగదు లావాదేవీలపై ఎలాంటి చార్జీలు తీసుకోకుండా ఈ సంస్థలు ఎలా మనగలుగుతున్నాయి? అంతేకాకుండా ప్రతి సంవత్సరం కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఏవిధంగా ఆర్జిస్తున్నాయి? కస్టమర్లకు ఉచితంగా సేవలు అందించాల్సిన అవసరం ఏముంది? ఈ కంపెనీలు నడపడానికి అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వినియోగదారుల నుంచి రుసుములు వసూలు చేయకుండా, ఉత్పత్తులేవీ విక్రయించకుండా ఎలా సంపాదిస్తున్నాయి?
ఉచితంగా ఉపయోగించే ఈ డిజిటల్ యాప్‌లు ఏ ఉత్పత్తిని అమ్మకుండానే ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాయంటే.. దానికి కారణం కస్టమర్ల నమ్మకం. నమ్మకం ఆధారంగా ఏర్పడిన ప్రత్యేకమైన వ్యాపార నమూనా నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. డిజిటల్ యాప్‌ల నుంచి చెల్లించిన సొమ్ములు ఎక్కడికి పోవన్న భరోసాతోనే వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నారు.
స్పీకర్ సర్వీస్‌తో..
డిజిటల్ యాప్‌ల ఆదాయంలో ఎక్కువ భాగం చిన్న కిరాణా దుకాణాల్లో ఉపయోగించే వాయిస్- ఆపరేటింగ్ స్పీకర్ సర్వీస్ ద్వారా వస్తుంది. మనం దుకాణం నుండి వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత చెల్లింపు చేసినప్పుడల్లా.. డబ్బులు వచ్చాయని చెప్పే వాయిస్ వినబడుతుంది. ఈ స్పీకర్‌ను కంపెనీ నెలకు రూ.100కి దుకాణదారులకు అద్దెకు ఇస్తుంది. మన దేశంలో దాదాపు 30 లక్షలకు పైగా స్పీకర్లు దుకాణాలకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా రూ.30 కోట్లు, ఏటా రూ.360 కోట్ల వరకు సంపాదిస్తున్నాయి.
స్క్రాచ్ కార్డులతో ఖుష్
దీంతో పాటు స్క్రాచ్ కార్డుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ కార్డులు క్యాష్‌బ్యాక్ లేదా కూపన్‌లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో పాటు వివిధ బ్రాండ్ల వాణిజ్య ప్రకటనలను జనాల్లోకి తీసుకెళుతున్నాయి. అందుకే స్క్రాచ్ కార్డులకు ఆయా బ్రాండ్లే సొమ్ములు చెల్లిస్తాయి. ఫలితంగా జీపే, ఫోన్‌పే (Phone pay) వంటి డిజిటల్ యాప్‌లు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతాయి. ఒకవైపు కస్టమర్లకు ఆకర్షణీయ ఆఫర్లు, మరోపక్క బ్రాండ్ల ప్రమోషన్‌తో డిజిటల్ యాప్‌లు దూసుకుపోతున్నాయి.
చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ విద్యార్థులు
పెరుగుతున్న ఆదరణ
తక్షణ నగదు లావాదేవీలు, బిల్లుల చెల్లింపుల పాటు వివిధ రకాల యూపీఐ సేవలను సులువుగా పొందే వీలుండడంతో ఉచిత డిజిటల్ యాప్‌లకు ఆదరణ ఎక్కువగా ఉంది. దీంతో మన దేశంలో ప్రతినెలా వేల కోట్లలో యూపీఐ నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. జూలైలో 19.47 బిలియన్ లావాదేవీలు (1947 కోట్లు) నమోదైనట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకటించింది.