టాటా గ్రూప్‌ చేతికి బిగ్‌బాస్కెట్‌! | Sakshi
Sakshi News home page

టాటా గ్రూప్‌ చేతికి బిగ్‌బాస్కెట్‌!

Published Thu, Oct 29 2020 5:15 AM

BigBasket in talks to sell majority stake to Tata Group - Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గ్రోసరీ స్టార్టప్‌ కంపెనీ బిగ్‌బాస్కెట్‌ను పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా రెండు సంస్థల మధ్య ఇప్పటికే ప్రారంభమైన చర్చలు పురోగతిలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటాను బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 7,350 కోట్లు)కు సొంతం చేసుకునే వీలున్నట్లు తెలుస్తోంది.

గ్రూప్‌లోని కన్జూమర్‌ బిజినెస్‌లన్నిటినీ కలుపుతూ ఇటీవల టాటా గ్రూప్‌ సూపర్‌ యాప్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేశీయంగా ఇటీవల అమెజాన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తదితర దిగ్గజాలు ఈకామర్స్‌ మార్కెట్లో కార్యకలాపాలను వేగవంతంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్‌ సైతం పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఈ అంశంపై ఇటు టాటా గ్రూప్, అటు బిగ్‌బాస్కెట్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు.

పోటీ తీవ్రం: బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన ఆన్‌లైన్‌ గ్రోసరీ కంపెనీ బిగ్‌బాస్కెట్‌ ఇప్పటికే వాల్‌మార్ట్‌కు మెజారిటీ వాటాగల ఫ్లిప్‌కార్ట్, యూఎస్‌ దిగ్గజం అమెజాన్‌.. తదితరాలతో పోటీని ఎదుర్కొంటోంది. కోవిడ్‌–19 నేపథ్యంలో ఇటీవల ఆన్‌లైన్‌ సర్వీసులకు డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. బిగ్‌బాస్కెట్‌లో చైనీస్‌ కంపెనీ అలీబాబా 26 శాతం వాటాను కలిగి ఉంది. అయితే డీల్‌లో భాగంగా అలీబాబా సైతం మొత్తం వాటాను విక్రయించే వీలున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement