తక్కువ రిస్క్‌తో స్టాక్‌ మార్కెట్‌పై పట్టు పెంచుకోవాలంటే..

Best Stocks At Affordable Price As Of Now For Best Portfolio - Sakshi

స్టాక్‌మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అక్కడుండే రిస్క్‌ పట్ల చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. అందువల్లే డీమమ్యాట్‌ ఖాతాలు పెరుగుతున్న తీరుకు మార్కెట్‌లోకి వస్తున్న పెట్టుబుడులకు మధ్య పొంతన ఉండటం లేదు. కానీతక్కువ పెట్టుబడితో మంచి పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకుంటే మార్కెట్‌పై అవగాహన వస్తుందని తద్వారా సక్సెస్‌ రూట్‌లో వెళ్లొచ్చని నిపుణులు అంటున్నారు. 

పెట్టుబడికి సిద్ధం
ఇంటర్నెట్‌ యాక్సెస్‌ పెరిగిన తర్వాత ద్వితీయ శ్రేణి నగరాలు, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలకు చెందిన వాళ్లకి సైతం స్టాక్‌మార్కెట్‌తో అనుసంధానం పెరిగింది. దీంతో పెట్టుబడులకు బ్యాంకులకు ప్రత్యామ్నాయంగా షేర్‌ మార్కెట్‌ వైపు చూస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్న డీ మ్యాట్‌ అకౌంట్లు ఇందుకు నిదర్శనం.

పోటెత్తుతున్నారు
డీమ్యాట్‌ అకౌంట్లకు సంబంధించి 2012-13 ఆర్థిక సంవత్సరంలో 2.1 కోట్ల ఖాతాలు ఉండేవి. కానీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి డీ మ్యాట్‌ ఖాతాలు కలిగి ఉన్నవారి సంఖ్య ఏకంగా 6.90 కోట్లకు చేరుకుంది. బ్యాంకు వడ్డీ రేట్లు పడిపోవడం, రియల్‌ ఎస్టేట్‌ చాలా మందికి అందని ద్రాక్షగా మారడంతో షేర్‌ మార్కెట్‌ వైపు వస్తున్నారు.

లాంగ్‌టర్మ్‌ బెటర్‌
షేర్‌మార్కెట్‌లో లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు అందించే ఇంట్రాడే ట్రేడింగ్‌తో రిస్క్‌ ఎక్కువని చెబుతుంటారు. అయితే కొత్తగా డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభించిన వారికి తక్కువ మొత్తంతో తమ పోర్ట్‌ఫోలియోలో మంచి కంపెనీల షేర్లు చేర్చడం ఏలా అనేదానిపై అనేక సందేహాలు ఉన్నాయి. 

బెస్ట్‌ పోర్ట్‌ఫోలియో
స్టాక్‌మార్కెట్‌లో ఎప్పుడూ ఒకే కంపెనీపై పెట్టుబడి పెట్టొదనేది మార్కెట్‌ గురువుల సలహా. మంచి పనితీరు కనబరుస్తూ తక్కువ ధరకి అందుబాటులో ఉన్న స్టాక్స్‌ని ఎంచుకుని అందులో ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమం. ఫైనాన్షియల్‌ ఎక్స్‌పర్ట్‌ సలహాను అనుసరించి ప్రస్తుతం మార్కెట్‌లో తక్కువ పెట్టుబడితో అందుబాటులో ఉన్న కొన్ని స్టాక్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

తక్కువ పెట్టుబడితో
- ఇండియన్‌ ఆయిల్‌ షేర్‌ ధర సెప్టెంబరు 27న రూ.118.65లుగా ఉంది. అక్టోబరు 25న ఈ కంపెనీ షేరు ధర రూ.131 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. లాటుగా 20 షేర్లను కొనుగోలు చేయాలనుకుంటే అవసరం అయ్యే పెట్టుబడి కేవలం రూ.2,620 మాత్రమే.
- ఇండియన్‌ ఆయిల్‌ తరహాలోనే సెయిల్‌, అశోక్‌ లేలాండ్‌, టాటా పవర్‌, జోమాటో, జ్యోతి ల్యాబ్స్‌, ది ఇండియా సిమెంట్స్‌,  దేవ్‌యానీ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ వంటి ప్రముఖ సంస్థల షేర్ల ధరలు ప్రస్తుతం రూ. 120 నుంచి 200 రేంజ్‌లో ఉన్నాయి. కేవలం రూ. 20,000ల నుంచి రూ. 25,000లతో మంచి పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేసుకోవచ్చు. దీని వల్ల తక్కువ రిస్క్‌తో మార్కెట్‌ను అవగాహన చేసుకుని ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడుతుంది.

పరిశీలన ముఖ్యం
ఇలా వివిధ సెక్టార్లలో మంచి పనితీరుని కనబరస్తూ తక్కువ ధరలో అందుబాటులో ఉన్న షేర్లను లాంగ్‌టర్మ్‌ పద్దతిలో కొనుగోలు చేయడం ఉత్తమం. అప్పుడే మన డబ్బుకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. అయితే షేర్లు కొనుగోలు చేసే ముందు మరోసారి మార్కెట్‌ పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఇన్వెస్ట్‌ చేయాలి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top