ఉద్యోగులకు పండుగ..జోరందుకున్న నియామ‌కాలు, భారీ వేతన ప్యాకేజీలు ఆఫర్‌!

Bengaluru Tops In Intent To Hire In Q2 2022 Said Employment Outlook Report - Sakshi

ముంబై: నియామకాల పరంగా జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి బెంగళూరు అగ్ర స్థానంలో ఉన్నట్టు టీమ్‌లీజ్‌ ‘ఎంప్లాయిమెంట్‌ అవుట్‌లుక్‌ రిపోర్ట్‌’ తెలిపింది. ఎక్కువ మందిని నియమించుకోనున్నట్టు 95 శాతం బెంగళూరు కంపెనీలు తెలిపాయి. ఆ తర్వాత చెన్నై, ముంబై నగరాలు ఉన్నాయి. చెన్నైలో 87 శాతం కంపెనీలు ఇదే ధోరణితో ఉన్నాయి.

ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో నియామకాల ఉద్దేశ్యం 91 శాతంతో పోలిస్తే ప్రస్తుత త్రైమాసికంపై మరింత ఆశావహ వాతావరణం ఉన్నట్టు టీమ్‌లీజ్‌ పేర్కొంది. దేశవ్యాప్తంగా చూస్తే ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులను నియమించుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు 61 శాతం కంపెనీలు తెలిపాయి.

జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే ఇది 7 శాతం అధికంగా నమోదైంది. బెంగళూరులో తయారీ, సేవల కంపెనీలు మరింత సానుకూల నియామకాల ఉద్దేశ్యంతో ఉన్నాయి. తయారీలో ఎఫ్‌ఎంసీజీ (48 శాతం) హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్‌లో (38 శాతం), విద్యుత్, ఇంధన రంగంలో(34 శాతం), వ్యవసా­యం, ఆగ్రో కెమికల్స్‌ రంగంలో 30 శాతం కంపెనీ­లు నియామకాల ఉద్దేశ్యాన్ని ప్రకటించాయి. సేవల రంగంలో ఐటీ రంగ కంపెనీలు 97 శాతం నియామకాల పట్ల సానుకూల ధోరణిని ప్రదర్శించాయి. ఆ తర్వాత ఈ కామర్స్, వాటి అనుబంధ స్టార్టప్‌లలో 85 శాతం, విద్యా సేవల్లో 70 శాతం, టెలికమ్యూనికేషన్స్‌లో 60 శాతం, రిటైల్‌లో 64 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో 55 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలతను వ్యక్తం చేశాయి.

 మరింత పెరుగుతాయి
‘‘మరిన్ని సంస్థలు తమ మానవ వనరులను పెంచుకోవడానికి, అధిక వేతనాలు చెల్లించేందుకు ఆసక్తిగా ఉన్నాయి. రానున్న త్రైమాసికాల్లో కంపెనీల్లో ఉద్యోగుల నియామకాల ధోరణి మరింత పెరిగి 97 శాతానికి చేరుకుంటుంది’’అని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మహేష్‌ భట్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లో 23 రంగాలకు చెందిన 865 కంపెనీల అభిప్రాయాలను టీమ్‌లీజ్‌ సర్వే పరిగణనలోకి తీసుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top