నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో లక్షల రూపాయల ప్యాకేజీలు తీసుకునే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల జీతాలే అందరికీ హాట్ టాపిక్. కానీ, రోజువారీ శ్రమను నమ్ముకున్న ఒక సాధారణ ఇంటి పనిమనిషి నెలవారీ సంపాదన వివరాలు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ నిపుణులను, విద్యావంతులను ఆలోచనలో పడేసాయి. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన ఇంటి పనిమనిషితో జరిపిన చిన్న సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది.
బెంగళూరుకు చెందిన ఆదిత్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇటీవల తన ఇంటి పనిమనిషి పదేపదే ఆలస్యంగా రావడంపై ఆమెను ప్రశ్నించాడు. సాధారణంగా మొదలైన ఈ ప్రశ్న ఆమె ఇచ్చిన సమాధానంతో ఆదిత్య అవాకయ్యేలా చేసింది. ఆమె కేవలం ఒకరి ఇంట్లోనే కాకుండా ఒక పక్కా ప్రణాళికతో బహుళ ఆదాయ వనరులను సృష్టించుకుందని తెలిసి అతను షాక్‌కు గురయ్యాడు. ఆదిత్య తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న వివరాల ప్రకారం.. ఆమె తన దినచర్యలో భాగంగా..
వేర్వేరు అపార్ట్‌మెంట్‌ల్లో నివసించే నలుగురు బ్యాచిలర్స్‌కు రోజువారీ భోజనం వండి పెడుతోంది. ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.6,000 చొప్పున తీసుకుంటోంది. దాంతో ఆమెకు రూ.24,000 లభిస్తోంది. దీనికి అదనంగా, మరో రెండు కుటుంబాలకు పూర్తిస్థాయి ఇంటి పనిమనిషిగా ఉంటూ నెలకు రూ.20,000 సంపాదిస్తోంది. మొత్తంగా ఆమె నెలవారీ ఆదాయం అక్షరాలా రూ.44,000. అంటే సంవత్సరానికి ఆమె సంపాదన రూ.5.28 లక్షలు. దేశంలో సగటు కార్పొరేట్ ఎంట్రీ-లెవల్ ఉద్యోగి జీతం కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం.
ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఆదిత్య ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. ‘ఇక్కడ వేలాది మంది చదువుకున్న యువత ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. కానీ సరైన నైపుణ్యం ఉంటే ఆదాయానికి కొరత లేదు’ అని పేర్కొన్నాడు. ఈ వ్యవహారం ద్వారా తాను ఒక గొప్ప విషయాన్ని గ్రహించానని ఆదిత్య రాసుకొచ్చాడు. ‘ఈ రోజు ఒక విషయం స్పష్టమైంది. ఏ పనీ చిన్నది కాదు. నైపుణ్యం, స్థిరత్వం, కష్టపడే తత్వం ఎప్పుడూ సరైన ఫలితాన్ని ఇస్తాయి’ అని అతను స్పష్టం చేశాడు.
కెరీర్ వృద్ధి వర్సెస్ శారీరక శ్రమ
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిపై నెటిజన్లు భిన్నమైన విశ్లేషణలు చేస్తున్నారు. ‘డిగ్రీలు లేకపోయినా ప్రాక్టికల్ నైపుణ్యాలతో స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని ఆర్జించవచ్చని నిరూపితమైంది’ అని కొందరంటున్నారు. ‘దేశంలో పట్టభద్రులైన యువత ఉద్యోగాల కోసం అల్లాడుతున్న వేళ ఇదొక ప్రత్యామ్నాయం’ అని కొందరు చెబుతున్నారు. డిగ్రీలు పూర్తి చేసినా అర్థవంతమైన ఉపాధి దొరకని దేశీయ ఉద్యోగ సంక్షోభాన్ని ఈ ఉదంతం ప్రతిబింబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
విజయానికి కొలమానం ఏది?
ఈ వైరల్ కథనం మారుతున్న భారతదేశ శ్రామిక శక్తి వాస్తవ రూపానికి అద్దం పడుతోంది. విజయాన్ని కేవలం నెలవారీ జీతం అంకెలతోనే కొలవాలా? లేక భవిష్యత్తు వృద్ధి, ఉద్యోగ భద్రత, జీవన నాణ్యత ఆధారంగా అంచనా వేయాలా? అనే పెద్ద ప్రశ్నను ఇది సమాజం ముందుంచింది. ఏదేమైనా, విద్యావంతుల్లో పెరుగుతున్న నిరుద్యోగానికి, నైపుణ్య ఆధారిత పనులకు ఉన్న డిమాండ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!


