దూసుకెళ్తున్న బంధన్‌ బ్యాంక్‌ షేర్లు | Bandhan Bank shares surge 14pc after in Q4 results | Sakshi
Sakshi News home page

దూసుకెళ్తున్న బంధన్‌ బ్యాంక్‌ షేర్లు

Apr 29 2026 1:53 PM | Updated on Apr 29 2026 2:16 PM

Bandhan Bank shares surge 14pc after in Q4 results

స్టాక్‌ మార్కెట్‌లో బంధన్ బ్యాంక్ షేర్లు దూసుకెళ్తున్నాయి. మంగళవారం మార్కెట్ సెషన్‌ తర్వాత ప్రకటించిన మార్చి త్రైమాసిక ఫలితాలకు ప్రతిస్పందనగా బ్యాంకు షేర్లు బుధవారం సుమారు 14 శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. బంధన్ బ్యాంక్ షేర్లు (Bandhan Bank Stock Price) బుధవారం మధ్యాహ్నం 12.50 గంటలకు 13.8% పెరిగి  రూ.203.36 వద్ద ఉన్నాయి. గత నెలలో స్టాక్ 43.9% లాభపడింది. బంధన్ బ్యాంక్ షేర్లు ఏప్రిల్లో ఇప్పటివరకు 27% పెరిగాయి. జూన్ 2020 (47%) నుండి బంధన్‌ బ్యాంక్‌ స్టాక్‌ ఉత్తమ నెలవారీ పనితీరు ఇదే.

క్యూ4 ఫలితాలు
బంధన్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 68 శాతం జంప్‌చేసి రూ. 534 కోట్లను తాకింది. రుణ నాణ్యత మెరుగుపడటంతోపాటు.. రిటైల్‌ బ్యాంకింగ్, ట్రెజరీ విభాగాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. రిటైల్‌ బ్యాంకింగ్‌ నష్టాల నుంచి బయటపడటమేకాకుండా రూ. 434 కోట్ల లాభం ఆర్జించింది. ఇక ట్రెజరీ కార్యకలాపాల నుంచి రూ. 206 కోట్ల లాభం సమకూరింది. దీంతో హోల్‌సేల్‌ బ్యాంకింగ్‌ రూ. 80 కోట్ల నష్టం నమోదు చేసినప్పటికీ పనితీరు మెరుగుపడింది.

స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.7 శాతం నుంచి 3.3 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.3 శాతం నుంచి 1 శాతానికి దిగివచ్చాయి. అయితే ఈ కాలంలో రూ. 677 కోట్ల ప్రొవిజన్లు చేపట్టింది. నికర వడ్డీ ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 2,796 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 3 శాతం పుంజుకుని రూ. 3,567 కోట్లకు చేరింది. కాగా.. పూర్తి ఏడాదికి బ్యాంక్‌ నికర లాభం సగానికిపైగా క్షీణించి రూ. 1,224 కోట్లకు పరిమితమైంది. 2024–25లో రూ. 2,745 కోట్లు ఆర్జించింది. అధిక ప్రొవిజన్లు లాభాలను దెబ్బతీశాయి.

Advertisement
 
Advertisement
Advertisement