
స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. అయితే ప్రపంచంలోనే టాప్ కంపెనీగా ఉన్న యాపిల్ మాత్రం ఈ విభాగంలో ఉత్పత్తులను తీసుకురాలేదు. కానీ ఎట్టకేలకు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో యాపిల్ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
యాపిల్ 2026లోనే ఫోల్డబుల్ ఫోన్‌ను విపణిలోకి తీసుకురాబోతుందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. టెక్ విశ్లేషకులు, ఇన్‌సైడర్ల వివరాల ప్రకారం ఫోల్డబుల్ ఐఫోన్ 2026 ద్వితీయార్ధంలో ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు ఆవిష్కరించే అవకాశం ఉంది. ఐఫోన్ ఎక్స్ తర్వాత యాపిల్ తన ఉత్పత్తుల్లో చేయనున్న అతిపెద్ద డిజైన్ మార్పు ఇదేనని చెబుతున్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్‌ను పోలిన బుక్ స్టైల్ ఫోల్డింగ్ విధానంలో ఉంటుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: కార్డు ఉంది కదా అని రెచ్చిపోతున్నారు!
జేపీ మోర్గాన్ అనలిస్ట్ సమిక్ ఛటర్జీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఫోల్డబుల్ ఐఫోన్ 7.8 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 5.5 అంగుళాల బాహ్య డిస్ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేశారు. ఈ ఫోన్ ధరపై కూడా కొందరు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అంచనా వేస్తున్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ ప్రారంభ ధర 1,999 డాలర్లుగా ఉంటుందని సూచిస్తున్నారు. ఇది ఇండియాలో సుమారు రూ.1.75 లక్షలుగా ఉండొచ్చని చెబుతున్నారు.