
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో ఉత్పత్తి చేయడం ప్రతి కంపెనీకి ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. తాము అమెరికాలో విక్రయించబోయే అధిక శాతం ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయంటూ టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించడం ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు.
‘రాబోయే రోజుల్లో తమ మొబైల్ ఫోన్లు అన్నింటినీ భారత్‌లోనే తయారు చేయాలని, సోర్సింగ్ చేయాలని యాపిల్ నిర్ణయించుకుంది. కాబట్టి భారత్‌లో ఇన్వెస్ట్ చేశారంటే విశ్వసనీయతను, సహజత్వాన్ని, అఫోర్డబిలిటీని (తక్కువ వ్యయాల ప్రయోజనాలు) ఎంచుకున్నట్లే’ అని భారత్ టెలికం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం దన్నుతో దేశీయంగా టెలికం పరికరాల మార్కెట్ అనెక రెట్లు వృద్ధి చెందిందని ఆయన తెలిపారు. రూ.4,000 కోట్ల పెట్టుబడులనేవి రూ.80,000 కోట్ల విక్రయాలకు, రూ.16,000 కోట్లు విలువ చేసే ఎగుమతులతో పాటు 25,000 ఉద్యోగాల కల్పనకు దోహదపడినట్లు సింధియా చెప్పారు.
ఇదీ చదవండి: ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే మెజారిటీ ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయని టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇదివరకే ప్రకటించారు. ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ మొదలైనవి వియత్నాంలో తయారైనవి ఉంటాయని పేర్కొన్నారు. ఇతరత్రా దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు మాత్రమే అత్యధికంగా చైనాలో తయారవుతాయని పేర్కొన్నారు. చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అమెరికా భారీగా టారిఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో కుక్ వ్యాఖ్యలు ఇటీవల ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంత మినహాయింపులున్నా, వివిధ టారిఫ్‌లను కలిపితే చైనా నుంచి ఎగుమతి చేసే తమ ఉత్పత్తులపై ఏకంగా 145 శాతం సుంకాలు వర్తిస్తాయని కుక్ తెలిపారు.