
న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ మార్చి త్రైమాసికంలో రూ.26 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 138 శాతం పెరిగింది. ఆదాయం 35 శాతం పెరిగి రూ.726 కోట్లకు చేరింది. డిజిటల్ బ్యాంక్‌గా తమ స్థానం మరింత బలపడినట్టు పేర్కొంది.
గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ లాభం 81 శాతం పెరిగి రూ.63 కోట్లకు చేరగా, ఆదాయం 47 శాతం వృద్ధితో రూ.2,709 కోట్లుగా నమోదైంది. కస్టమర్ అకౌంట్ బ్యాలన్స్‌లు రూ.3,659 కోట్లకు చేరినట్టు.. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 31 శాతం పెరిగినట్టు ప్రకటించింది.
సురక్షితమైన రెండో ఖాతాను స్వీకరించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్టు.. డిజిటల్ చెల్లింపులకు ప్రత్యామ్నాయ బ్యాంక్ ఖాతాకు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో అనుబ్రత బిశ్వాస్ తెలిపారు.