
రెండు రోజుల పాటు సమావేశం
పన్ను శ్లాబుల క్రమబద్ధీకరణపై నిర్ణయం
న్యూఢిల్లీ: జీఎస్‌టీ కౌన్సిల్ రెండు రోజుల సమావేశం బుధవారం ప్రారంభం కానుంది. జీఎస్‌టీలో ఇప్పుడున్న 5, 12, 18 28 శాతం శ్లాబుల స్థానంలో 5, 18 శాతం శ్లాబులను కొనసాగించి, మిగిలిన వాటిని ఎత్తేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. 12, 28 శాతం శ్లాబుల్లో ఉన్న వాటిని 5, 18 శాతం శ్లాబుల్లోకి సర్దుబాటు చేయనున్నారు. సిగరెట్, గుట్కాలు, విలాసవంతమైన కొన్ని వస్తువులపై మాత్రం 40 శాతం ప్రత్యేక పన్ను రేటును అమలు చేయాలన్నది ప్రతిపాదన. దీనికి జీఎస్‌టీ మంత్రుల బృందం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేయగా.. జీఎస్‌టీ మండలి దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
3, 4వ తేదీల్లో జరిగే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించనున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన (ఈవీలు) కొనుగోలును ప్రోత్సహించేందుకు వీలుగా వాటిని 5 శాతం రేటు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శ్లాబుల తగ్గింపుతో చాలా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. దీన్ని విపక్ష పాలిత రాష్ట్రాలు ఆహ్వానిస్తూనే.. ఆదాయ నష్టం ఏర్పడితే కేంద్రం భర్తీ చేయాలని కోరుతుండడం గమనార్హం.
2017 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్‌టీ అమల్లోకి వచి్చంది. అప్పట్లో జీఎస్‌టీలోకి మారడం కారణంగా రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు వీలుగా కాంపెన్సేషన్ సెస్సు (1–290 శాతం మధ్య)ను విలాసవంత, హానికారక వస్తువులపై అమలు చేస్తున్నారు. దీని గడువు 2026 మార్చితో ముగిసిపోనుంది. ఆ తర్వాత కొనసాగించకూడదన్నది కేంద్రం ఉద్దేశమని తెలుస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం
ఎలక్ట్రిక్ వాహనాలపై (రూ.10 లక్షల వరకు) 18 శాతం జీఎస్‌టీకి మంత్రుల బృందం సానుకూలంగా ఉంది. కానీ, మరింత మంది ఈవీలను కొనుగోలు చేసేందుకు వీలుగా 5 శాతం రేటుకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెయ్యి, నట్స్, తాగు నీరు (20 లీటర్ల క్యాన్‌లు), నమ్‌కీన్, కొన్ని రకాల పాదరక్షలు, దుస్తులు, మందులు, వైద్య పరికరాలను 12 శాతం నుంచి 5 శాతం రేటు కిందకు మార్చే అవకాశం ఉంది. పెన్సిళ్లు, సైకిళ్లు, గొడుగులను సైతం తక్కువ రేటు శ్లాబులోకి తీసుకురానున్నారు. కొన్ని రకాల టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, కొన్ని రకాల వాహనాలను 28% నుంచి 18% రేటులోకి తీసు కురానున్నట్టు తెలుస్తోంది.