బీబీసీ లాక్‌ల వద్ద లభ్యమైన హరిప్రసాద్ మృతదేహం
కొణిజర్ల: క్షణికావేశంలో భర్త నాగార్జునసాగర్ కాల్వలో దూకగా... ఆ విషయం తెలియగానే భార్య ఇంట్లో ఉరి వేసుకున్న విషయం విదితమే. కొణిజర్ల మండలం అమ్మపాలెంకు చెందిన ఆటో నడిపే తేజావత్ హరిప్రసాద్ కుటుంబంలో అప్పుల కారణంగా భార్య సునీతతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమాన బుధవారం ఉదయం బయటకు వెళ్లిన ఆయన సాగర్ కాల్వలో దూకుతున్నట్లు తన సోదరుడికి ఫోన్ చేశాడు. ఈ మేరకు గాలించగా వి.వెంకటాయపాలెం సమీపాన ఎన్నెస్పీ ప్రధాన కాల్వ వద్ద ఫోన్, ఆటో, చెప్పులు ఉండడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం గాలింపు చేపట్టారు. ఈ విషయం తెలియగానే ఇంట్లో ఉన్న సునీత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈక్రమాన రాత్రి వరకు గాలించినా హరిప్రసాద్ ఆచూకీ లభించలేదు. చివరకు గురువారం ఉదయం ఆయన మృతదేహం తనికెళ్ల బోనకల్ బ్రాంచ్ కాల్వ లాకుల వద్ద లభ్యమైంది. దీంతో భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుబీకులకు అప్పగించగా సాయంత్రం అమ్మపాలెం తీసుకొచ్చారు. ఈ క్రమాన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు మనోహర్, భార్గవి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. అనంతరం కుటుంబీకులు, స్థానికుల కన్నీటి నడుమ దంపతుల అంత్యక్రియలు పూర్తిచేశారు.


