మరో విద్యా మార్గమే..
విద్యా కేంద్రంగా లక్ష్మీదేవిపల్లిలోని పాల కేంద్రం విద్యార్థులకు చేరువకానున్న సీబీఎస్‌ఈ విద్య చుంచుపల్లికి పాల శీతలీకరణ కేంద్రం తరలింపు
అడవులు, ఖనిజ సంపద, పారిశ్రామిక ప్రగతితో ప్రత్యేక గుర్తింపు పొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యారంగంలోనూ మరో ముందడుగు వేయనుంది. ఇన్నాళ్లూ జిల్లాకు దూరమైన సీబీఎస్‌ఈ విద్యా విధానం కేంద్ర ప్రభుత్వ చొరవతో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం లక్ష్మీదేవిపల్లిలోని సుమారు ఐదెకరాల విజయ డెయిరీ స్థలాన్ని కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అధికారులు దాదాపు ఖరారు చేశారు. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న డెయిరీని కలెక్టర్ ఆదేశాల మేరకు చుంచుపల్లి ప్రాంతానికి తరలించనున్నారు. – చుంచుపల్లి
ఇన్నాళ్లూ జిల్లాకు దూరమే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామికంగా, ఖనిజ సంపద పరంగా రాష్ట్రంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. అయితే విద్యారంగంలో మాత్రం కేంద్రీయ విద్యాలయం లేకపోవడంతో విద్యార్థుళు కొత్తగూడెం వెలుపల ఉన్న పాఠశాలలపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ, పారామిలటరీ సిబ్బంది తదితర కుటుంబాల వారు బదిలీల కారణంగా చదువుకు అంతరాయం కలగకుండా దేశ వ్యాప్తంగా ఒకే తరహా విద్యా వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలల వ్యవస్థను రూపొందించారు. అయితే నిబంధనల ప్రకారం ఇతర విద్యార్థులకు కూడా ప్రవేశ అవకాశాలు ఉంటాయి. కేంద్రీయ విద్యాలయాల్లో పాఠ్య విద్యతో పాటు క్రీడలు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, కళలు, ఇతర కార్యక్రమాలకు ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో పనిచేసే ఉద్యోగుల కుటుంబాలకు ఇది స్థానికంగా విద్యా సౌకర్యాన్ని కల్పించే అవకాశం ఉండనుంది.
ఐదెకరాల్లో విద్యా ప్రాంగణం..
సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న లక్ష్మీదేవిపల్లి ప్రాంతంలోని విజయ డెయిరీని చుంచుపల్లికి తరలిస్తే కొత్తగూడెం పట్టణానికి సమీపాన ఉండటం, రహదారి సౌకర్యం వంటి అంశాల నేపథ్యాన ఆ స్థలం విద్యా అవసరాలకు ఎంతో ఉపయోగపడనుంది. ప్రభుత్వ శాఖలు, కేంద్రీయ విద్యాలయ నిబంధనల ప్రకారం కేంద్రీయ విద్యాలయం అందుబాటులోకి వస్తే లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, కొత్తగూడెం పరిసర ప్రాంతాలతోపాటు పాల్వంచ వైపు నుంచి కూడా విద్యార్థులు రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యాన విద్యా సంస్థ జిల్లాలో అడుగుపెట్టడం ద్వారా సీబీఎస్‌ఈ విద్యపై అవగాహన పెరిగి జిల్లాలో విద్యా రంగానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇక పాఠశాల పూర్తిస్థాయిలో ఏర్పాటైతే బోధన, బోధనేతర సిబ్బంది రాకపోకలు, విద్యార్థుల రవాణా, పాఠశాల చుట్టూ అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలు కూడా ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.
ఇప్పటివరకు జిల్లాలో కేంద్రీయ విద్యాలయం లేకపోవడంతో సీబీఎస్‌ఈ విధానానికి దూరమైన విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయం ప్రతిపాదన కార్యరూపం దాల్చితే కొత్తగూడెం పరిసర ప్రాంతాలతోపాటు సమీప మండలాల విద్యార్థులకు మరో విద్యా మార్గం తెరుచుకున్నట్టే. ఇటీవల కలెక్టర్ అంకిత్ లక్ష్మీదేవిపల్లిలోని మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించగా.. పాడి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకోసం చుంచుపల్లిలో విజయ డెయిరీ కోసం ఇప్పటికే స్థల అన్వేషణ చేస్తూ.. అదే ప్రాంతంలో మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పాల సేకరణకు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
భద్రాద్రికి తొలిసారిగా కేంద్రీయ విద్యాలయం


