వాగులో పడి ఆటో డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

వాగులో పడి ఆటో డ్రైవర్‌ మృతి

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ముర్రేడు వాగులో పడి ఆటో డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన గురువారం పాతకొత్తగూడెంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పాత కొత్తగూడెంకు చెందిన ఎండీ దస్తగిరి పాషా (42) ఫైనాన్స్‌లో తీసుకున్న ఆటో విషయంలో గత కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. ఈక్రమాన ఈనెల 13న దస్తగిరికి ఇంట్లో వివాదం జరగగా ఎప్పటిలానే తన కుమారుడితో కలిసి ఆటోలో పాత కొత్తగూడెంలోని డంపింగ్‌ యార్డ్‌ వద్దకు వెళ్లాడు. అక్కడ దిగి కుమారుడిని ఇంటికి పంపించి కాసేపటికీ తన కుమారుడికి ఫోన్‌ చేసి వచ్చి ఫోన్‌ తీసుకెళ్లమని చెప్పడంతో అతను అక్కడకు వచ్చి ఫోన్‌ తీసుకెళ్లాడు. ఆ తర్వాత దస్తగిరి ఇంటికి తిరిగి రాలేదు. దస్తగిరి అప్పుడప్పుడు ఇంట్లో చెప్పకుండానే కొద్ది రోజులపాటు బయటకు వెళ్తుంటాడని, ఇదే క్రమంలో 13న కూడా వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నేపథ్యాన పాత కొత్తగూడెంలోని ముర్రేడు వాగులో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడకు వెళ్లి పరిశీలించగా.. దస్తగిరి పాషాగా తేలింది. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి సంఘటన స్థలంలోనే వారి సమక్షంలో మృతదేహానికి పోస్టుమార్టం, పంచనామా నిర్వహించారు. మృతుడికి భార్య రేష్మ, కుమారుడు షారుక్‌ ఉన్నారు. మృతుడి కుమారుడు షారుక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తగూడెం వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.కరుణాకర్‌ తెలిపారు.

మద్యం మత్తులో

డ్రెయినేజీలో పడిన వ్యక్తి..

పాల్వంచ: మద్యం మత్తులో ఓ వ్యక్తి డ్రెయినేజీ కాల్వలో పడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలో బాపూజీనగర్‌కు చెందిన వ్యాపారి నడిమికంటి సింహాద్రి కుమారుడు దాలి నాయుడు(37)కి, లక్ష్మితో 14ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. లక్ష్మి ప్రస్తుతం విజయవాడలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా.. భార్యభర్తల మధ్య విభేదాలతో గత మూడేళ్లుగా దాలి నాయుడు పాల్వంచ వచ్చి తండ్రి వద్దే ఉంటున్నాడు. ఈక్రమాన మద్యానికి బానిస కాగా బుధవారం మధ్యాహ్నం బయటకు వెళ్తానని చెప్పి వెళ్లిన అతను రాత్రి అయినా ఇంటికి రాలేదు. గురువారం తెల్లవారుజామున నెహ్రునగర్‌లోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ పక్కన ఉన్న డ్రెయినేజీ కాల్వలో పడి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు వచ్చి చూడగా.. అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఊపిరి ఆడక చనిపోయినట్లు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేశారు.

బతుకుదెరువు కోసమని వెళ్లి..

ఇల్లెందురూరల్‌: మండలంలోని కొమరారం గ్రామానికి చెందిన కాంపాటి సుందర్‌ (42) బతుకుదెరువు కోసం రాష్ట్రం దాటి వెళ్లి గురువారం విగతజీవిగా ఇంటికి తిరుగొచ్చిన సంఘటన ఇది. మ్యాజిక్‌ డ్రైవర్‌గా, బ్యాండ్‌ మేళం ద్వారా ఉపాధి పొందేవాడు. వినాయక చవితి వేడుకల్లో బ్యాండ్‌ వాయించేందుకు ఒప్పందం మేరకు గుంటూరు జిల్లా తెనాలికి స్నేహితులతో కలిసి మూడు రోజుల క్రితం వెళ్లాడు. అక్కడ గురువారం ఉదయం గుండెపోటు రావడంతో నిద్రలోనే సుందర్‌ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికి చేరుకున్న సుందర్‌ భౌతికకాయానికి కొమరారం సర్పంచ్‌ అజ్మీర బిచ్చా, గ్రామపెద్దలు నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement