రానున్న రోజుల్లో
కీలక జంక్షన్‌గా..
● రానున్న కాలంలో కేంద్రస్థానంగా భద్రాచలం రోడ్ స్టేషన్ ● సికింద్రాబాద్ నుంచి విడదీసి కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తే మేలు ● కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతిపత్రం..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ మధ్య రైల్వేను విభజించి గుంతకల్, గుంటూరు, విజయవాడ జోన్లతో విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జోన్ల విభజనతోపాటే సికింద్రాబాద్ డివిజన్‌ను కూడా విభజించి భద్రాచలం రోడ్ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలనే పలువురు డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ ప్రధాన కార్యాలయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలో 6,424కి.మీ పరిధిలో విస్తరించి ఉంది. దీని పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉన్నాయి. 1556 కి.మీ ట్రాక్‌తో అతి పెద్దగా ఉన్న సికింద్రాబాద్ డివిజన్‌ను విభజించి కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దకాలంగా ఉన్నా రైల్వేబోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
1932లో కొత్తగూడెం స్టేషన్..
బొగ్గు రవాణాకు డోర్నకల్ జంక్షన్‌ను పాయింట్‌గా తీసుకుని 1927లో ఇల్లెందు (సింగరేణి కాలరీస్)కు రైల్వేలైన్ నిర్మించారు. ఆ తర్వాత 1932లో కొత్తగూడెం (భద్రాచలంరోడ్)కు రైల్వే కనెక్టివిటీ వచ్చింది. 1987లో మణుగూరుకు కూడా రైల్వే లైన్ వచ్చింది. అయితే 2005లో ఇల్లెందుకు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులు ఆ స్టేషన్‌ను కూడా ఎత్తివేశారు. అయితే, కొత్తగూడెం స్టేషన్ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. 2032 నాటికి స్టేషన్‌కు వందేళ్లు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఇటీవల కలిసి విన్నవించారు.
రాబోయే రోజుల్లో భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ విజయవాడ తరహాలో కీలక జంక్షన్‌గా మారనుంది. ప్రస్తుతం మంజూరైన మణుగూరు –రామగుండం, భద్రాచలంరోడ్ – కొవ్వూరు, భద్రాచలం–మల్కన్‌గిరి, కొత్తగూడెం– కిరండోల్ లైన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి తోడు డోర్నకల్–విజయవాడ కు ప్రత్యామ్నయంగా కొత్తగూడెం – కొండపల్లి (పెనుబల్లి –కొండపల్లి) మార్గానికి ఇప్పటికే సర్వే జరిగింది. వీటిలో ఏఒక్కటి అందుబాటులోకి వచ్చి నా, దానికి కేంద్ర స్థానం కొత్తగూడెమే అవుతుంది. 740.కి.మీ కొత్త రైల్వే లైను అందుబాటులోకి వస్తుంది. దీనికి ప్రస్తుతం ఉన్న డోర్నకల్–భద్రాచలంరోడ్–మణుగూరు (106 కి.మీ) రైల్వేలైన్‌ను కూడా కలిపితే మొత్తం ట్రాక్ 846 కి.మీ అవుతుంది. దీంతో రైల్వే ఉద్యోగులు/కార్మికుల సంఖ్య కూడా పెరుగుతుంది. పరిపాలన పరంగా సికింద్రాబాద్ 280 కి.మీ దూరంలో ఉండగా, భద్రాచలంరోడ్ కేంద్రంగా కొత్త డివిజన్ డిమాండ్‌కు హేతుబద్ధత ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే రైల్వే లైన్లు అన్నీ రిజర్వ్ ఫారెస్ట్ గుండా సాగేవే. ఈ నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ, భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తే పాలనాపరమైన సౌలభ్యం కలగనుంది.


