● సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ ● సింగరేణి ప్రధాన కార్యాలయం ముట్టడి, నాయకుల అరెస్ట్
రుద్రంపూర్: సింగరేణి సిరులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే.నారాయణ విమర్శించారు. సింగరేణి పరిరక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. కోల్‌బెల్ట్ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్మికులు, యూనియన్ కార్యకర్తలు కొత్తగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హెడ్డాఫీస్ చేరుకుని ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి పొర్లు దండాలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఉద్రిక్తత నెలకొనగా, సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ, ఏఐటీయూసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి వన్‌టౌన్‌కు తరలించారు. అంతకుముందు ఆందోళనను ఉద్దేశించి నారాయణ, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలన్నీ పరిష్కరించాలని, లేకపోతే సమ్మె సైరన్ మోగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, నాయకులు సాబిర్‌పాషా, మిర్యాల రంగయ్య, కే.సారయ్య, వీరభద్రయ్య, వైవీ రావు, ముస్కే సమ్మయ్య, వంగా వెంకట్, జి. వీరస్వామి, రమణమూర్తి పాల్గొన్నారు.


