పొగాకు బ్యారన్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

పొగాకు బ్యారన్‌ దగ్ధం

Mar 31 2026 8:38 AM | Updated on Mar 31 2026 8:38 AM

అశ్వారావుపేటరూరల్‌: అగ్ని ప్రమాదంలో ఓ పొగాకు బ్యారన్‌ దగ్ధమైన ఘటన సోమవారం మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..నల్లబాడు గ్రామానికి చెందిన రైతు సింహాద్రి వీర్రాజు ఈ నెల 24న వర్జీనియా పొగాకును క్యూరింగ్‌ చేసేందుకు బ్యారన్‌లో ఎక్కించగా, ఈ క్రమంలోనే మంటల వ్యాపించి సుమారు రూ.6లక్షల విలువైన పొగాకు కాలి బూడిదైంది. స్థానికుల సమాచారంతో అశ్వారావుపేట అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో వచ్చి మంటలను అదుపు చేశారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

దమ్మపేట: పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... దమ్మపేట గ్రామానికి చెందిన పసుమర్తి వీర వెంకటేశ్వరరావు (57), అతడి భార్యకు వ్యవసాయ పనుల విషయంలో ఈ నెల 3న గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య సుభద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్‌రెడ్డి తెలిపారు.

కారు ఢీకొని వ్యక్తి ..

దమ్మపేట: కారు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని ముష్టిబండ గ్రామ శివారులో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ముష్టిబండ గ్రామానికి చెందిన గద్దల నాగబాబు (39) వేకువజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామ శివారుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా అశ్వారావుపేట వైపు నుంచి సత్తుపల్లికి వెళుతున్న కారు ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలై నాగబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్యనాగమణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సాయికిషోర్‌రెడ్డి తెలిపారు.

క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నం

తండ్రీ కొడుకుల పరిస్థితి విషమం

మణుగూరు టౌన్‌: భార్యతో కుటుంబ తగాదాల నేపథ్యంలో భర్త గడ్డిమందు తాగి, కుమారుడికి తాగించిన సంఘటన మణుగూరులోని రామానుజవరంలో సోమవారం జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం... జూలూరుపాడుకు చెందిన నగేష్‌ భార్య, కుమారుడు కౌశిక్‌తో కలిసి రామానుజవరంలో వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలు జరగ్గా, భార్య అక్కడికి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. భార్యతో గొడవ అనంతరం క్షణికావేశంతో నగేష్‌ గడ్డిమందు తాగాడు. కుమారుడికి కూడా తాగించాడు. దీంతో ఇద్దరు అపస్మారక స్థితికి వెళ్లగా, స్థానికులు మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తీసుకెళ్లారు.

గంజాయి రవాణాదారుల అరెస్ట్‌

అశ్వాపురం: గొల్లగూడెంలో ఆదివారం రాత్రి నలు గురు గంజాయి రవాణాదారులను అరెస్ట్‌ చేసినట్టు సీఐ అశోక్‌రెడ్డి సోమవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లగూడెం వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన కారు ను ఆపి సోదా చేశారు. దీంతో రూ.57,500 విలువైన 1.150 కేజీల గంజాయి లభించింది. విచారణ చేపట్టగా హైదరాబాద్‌కు చెందిన ముస్తాపూర్‌ రాహుల్‌, ప్రశాంత్‌, బిత్తిరి విజయ్‌కుమార్‌, యోగేంద్రజాదవ్‌లు ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి గంజాయి తరలిస్తున్నట్లు తేలింది. దీంతో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని, కారు సీజ్‌ చేశామని సీఐ తెలిపారు.

ద్విచక్ర వాహన

దొంగలు అరెస్ట్‌

నర్సంపేట రూరల్‌: ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసిన ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వరంగల్‌ జిల్లా నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన పొన్నాల శివశంకర్‌, ఆయన భార్య రేణుక, పర్ని అశోక్‌ వాహనాల చోరీకి పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించగా వారి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఈమేరకు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో టౌన్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్సైలు రవికుమార్‌, గూడ అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement