● ప్రతీవారం నిర్వహిస్తుండటంతో బాధితుల హర్షాతిరేకాలు ● కలెక్టర్‌ హెచ్చరికలతో హాజరవుతున్న జిల్లాస్థాయి అధికారులు | - | Sakshi
Sakshi News home page

● ప్రతీవారం నిర్వహిస్తుండటంతో బాధితుల హర్షాతిరేకాలు ● కలెక్టర్‌ హెచ్చరికలతో హాజరవుతున్న జిల్లాస్థాయి అధికారులు

Mar 31 2026 8:38 AM | Updated on Mar 31 2026 8:38 AM

● ప్రతీవారం నిర్వహిస్తుండటంతో బాధితుల హర్షాతిరేకాలు ● కలెక్టర్‌ హెచ్చరికలతో హాజరవుతున్న జిల్లాస్థాయి అధికారులు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహిస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్చికి ముందు సుమారు ఆరునెలల వరకు కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించలేదు. దీంతో బాధితులు తీవ్ర నిరాశ చెందారు. గత నెల చివరిలో నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్‌ అధికారులతో మొదట ప్రజావాణి నిర్వహణపైనే ఆరా తీశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మార్చి 2న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారుల హాజరును పరిశీలించా రు. కొందరు జిల్లాస్థాయి అధికారులు హాజరుకాకుండా వారి స్థానంలో ఇతర అధికారులను పంపించడంతో గట్టిగా హెచ్చరించారు. శాఖాపరమైన అత్యవసర పనులను ఉంటే ముందుగానే అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ప్రజా వాణి కార్యక్రమానికి జిల్లాస్థాయి అధికారుల హాజ రు పెరిగింది. ప్రజలు సమస్యలపై దరఖాస్తు చేసుకునే సందర్భంలో అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులను పిలిచి వారికి ఆ దరఖాస్తును అందజేసి పరిష్కారానికి ఉన్న అవకాశాలు, ఒక వేళ లేకపోతే కారణాలను నివేదికల రూపంలో అందజేయాలని ఆదేశిస్తున్నారు. దీంతో వివిధ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చే బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ అంకిత్‌ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యాచందన, హౌసింగ్‌ పీడీ రవీంద్రనాథ్‌తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారానికి ఎండార్స్‌ చేశారు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో

కొన్నింటి వివరాలు

● కొత్తగూడెం మేదరబస్తీకి చెందిన మహమ్మద్‌ అబ్దుల్‌ వాహబ్‌ అశ్వారావుపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 911/33లో 5 గుంటల రిజిస్టర్‌ భూమి తన పేరున ఉన్నా ఆర్‌ఎస్‌ఆర్‌ సమస్య కారణంగా పట్టాదారు పాస్‌పుస్తకం అందలేదని విన్నవించారు. పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరు చేయాలని కోరగా, కలెక్టర్‌ భూ భారతి విభాగానికి ఎండార్స్‌ చేశారు.

● ఇందిరా జలప్రభ పథకంలో బోరు మంజూరైనా మోటార్‌ మీటర్‌కు సర్వీస్‌ నంబర్‌ ఇవ్వలేదని టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన ఆంగోతు సంతులాల్‌ ఫిర్యాదు చేశారు. అర్జీని పరిశీలించిన కలెక్టర్‌ విద్యుత్‌ శాఖ అధికారికి ఎండార్స్‌ చేశారు.

● తన భర్త మృతితో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, పీజీ చదువుకున్న తన కుమార్తెకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఆళ్లపల్లి మండలం చెలగట్టు గ్రామానికి చెందిన కొమరం సారమ్మ విన్నవించగా, దరఖాస్తును సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేశారు.

● ఎనిమిదేళ్లుగా తమ ఇంటికి కిన్నెరసాని తాగునీటి సరఫరా నిలిచిపోయినా నీటి బిల్లులు విధిస్తున్నారని కొత్తగూడెం మేదరబస్తీ 53వ డివిజన్‌కు చెందిన శ్రీనివాస్‌ వివరించారు. నీటి బిల్లులను రద్దు చేసి కొత్త కనెక్షన్‌ మంజూరు చేయాలని కోరుతూ అందజేసిన దరఖాస్తును పరిశీలించి కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎండార్స్‌ చేశారు.

● రంజాన్‌, బక్రీద్‌ పర్వదినాల్లో సామూహిక ప్రార్థనలు చేసుకునేందుకు పినపాక, ఏడూళ్ల బయ్యారం, జానంపేట, టి.కొత్తగూడెం పరిసర ప్రాంతాల ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు. ఈద్గాకు స్థలం కేటాయించాలని కోరుతూ అందజేసిన దరఖాస్తును పరిశీలించి పినపాక తహసీల్దార్‌కు ఎండార్స్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement