చండ్రుగొండ: మండల కేంద్రంలో ఓ వృద్ధుడిపై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన గురువారం చోటుచేసుకుంది. రావికంపాడు రోడ్డు వైపు నివాసం ఉండే దడిగల సత్యం ఇంటి పెరట్లో మామిడి చెట్టు ఉండగా రక్షణ కోసం ప్లాస్టిక్ జాలి ఏర్పాటు చేశారు. ఆ జాలీలో పిల్ల కోతి చిక్కుకుంది. దానిని తరిమేందుకు సత్యం యత్నించగా కోతుల గుంపు అతడిపై దాడిచేసి గాయపరిచాయి. క్షతగాత్రుడిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు.
భూ వివాదంలో
ఓ వ్యక్తిపై దాడి
గుండాల: భూ వివిదాం కోర్డులో ఉండగానే పనులు ఎందుకు చేపడుతున్నావని అడిగినందుకు ఓ వ్యక్తిపై తండ్రీ కొడుకులు కలిసి దాడి చేసి గాయపర్చిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు పఠాన్‌పాషా కథనం ప్రకారం.. ఆళ్లపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో ఉన్న స్థలం వివాదం కోర్టులో నడుస్తోందని, కానీ, అందులో తండ్రీకొడుకులు పనిచేస్తుండగా ప్రశ్నించానని తెలిపారు. దీంతో వారు తమ కుటుంబ సభ్యులపై దాడి చేశారని ఆరోపించారు. ఇంట్లో ఉన్న తన భార్యపై కూడా దాడి చేశారని తెలిపారు. తనను తీవ్రంగా గాయపర్చడంతో ఆళ్లపల్లి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కొత్తగూడెం రిఫర్ చేశారని, దాడిచేసినవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని పఠాన్‌పాషా వెల్లడించాడు.


