కల్యాణ మండపం, గ్యాలరీల మధ్య కుదరని పొంతన
అపరిశుభ్రతకు కేరాఫ్‌గా గ్యాలరీ హాళ్లు
మిథిలా స్టేడియం దిగువ భాగంలో ఒక హాలులో పోకల దమ్మక్క నిత్యాన్నదాన సత్రం, మరో హాల్‌లో హనుమాన్ భజన మందిరం కొనసాగుతున్నాయి. ఫలితంగా ఈ రెండు హాళ్లు ఎంతో శుభ్రంగా ఉన్నాయి. భద్రాచలం వచ్చే భక్తులకు తమ వంతుగా ఉపయోగపడుతున్నాయి. మిగిలిన హాళ్లను శుభ్రం చేసి వినియోగంలోకి తెచ్చేందుకు దేవాదాయశాఖతో పాటు మరే ఇతర ప్రభుత్వ విభాగాలూ పట్టించుకోవడం లేదు. దీంతో అవన్నీ నిరుపయోగంగా మారి అపరిశుభ్రతకు చిరునామాగా కనిపిస్తున్నాయి. ఆలయం పక్కనే సుమారు 15వేల మంది భక్తులకు అవలీలగా వసతి సౌకర్యం కల్పించే సామర్థ్యం గల ఈ స్టేడియాన్ని ఇకనైనా అభివృద్ధి చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
1988లో గ్యాలరీల నిర్మాణం
దేశంలో ఎక్కడా లేని విధంగా చైత్ర శుద్ధ నవమి రోజున సీతారాముల కల్యాణం జరిపించే సంప్రదాయాన్ని భక్త రామదాసు భద్రాచలంలో ఆరంభించారు. ఆ రోజుల్లో నాటి పాలకుడైన తానీషా స్వయంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు జానకిరాములకు సమర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. అలాగే రామయ్య కల్యాణ క్రతువు చూసేందుకు వస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నవమికి భద్రాద్రికి పోటెత్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆలయం వెలుపల 1960లో కల్యాణ మండపం పనులు మొదలుపెట్టగా 1964లో ప్రారంభమైంది. ఆ తర్వాత మండపంలో సీతారాముల కల్యాణాన్ని భక్తులు కనులారా చూసేందుకు వీలుగా 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కల్యాణ మండపం చుట్టూ గ్యాలరీలు నిర్మించి మిథిలా స్టేడియంగా నామకరణం చేశారు.
సమస్యల తిష్ట..
ఒకేసారి దీన్ని స్టేడియం తరహాలో నిర్మించకపోవడంతో కల్యాణ మండపం, గ్యాలరీల మధ్య సమన్వయం కొరవడింది. దీనికి తోడు కాల క్రమంలో మిథిలా స్టేడియం మధ్య భాగంలో ఎత్తుగా మట్టి పోయడంతో కల్యాణ మండపం, గ్యాలరీల మధ్య సమాంతరం లేకుండా పోయింది. దీంతో సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూద్దామనే ఆశతో భద్రాచలం వచ్చి గ్యాలరీలో కూర్చునే సామాన్య భక్తులకు కల్యాణ మండపం పైకప్పు తప్ప మరేమీ కనిపించని దుస్థితి నెలకొంది. ఈ అవస్థను కొంతైనా దూరం చేసేందుకు గ్యాలరీల వద్ద కనీసం ఎల్‌ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఇక స్టేడియం గ్యాలరీల దిగువ భాగంలో పరిస్థితి చెప్పనలవి కానంత దారుణంగా ఉంది. ప్రతీ శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి సమయాల్లో ఈ స్టేడియాన్ని ౖపైపెన శుభ్రం చేస్తుండగా ఆ తర్వాత రోజుల్లో ఇటు కన్నెత్తి చూడడం లేదు.
పేర్లే ఘనం..
సుమారు రెండెకరాల విస్తీర్ణంలో మిథిలా స్టేడియం నిర్మించారు. భక్తులు కూర్చునే గ్యాలరీలకు దిగువ భాగంలో పెద్ద పెద్ద హాళ్లు ఉన్నాయి. వీటికి గోదావరి ఉప నదులైన సీలేరు, శబరి, కిన్నెరసాని, తాలిపేరు, వశిష్ట, ఇంద్రావతి, ప్రాణహిత, మానేరు, మంజీర, పెన్‌గంగా, వార్దా వంటి పేర్లు పెట్టారు. ఉప నదుల పేరుతో ఏర్పాటు చేసిన పెద్ద హాళ్లన్నీ ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. వీటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో బూజు పట్టి, దుమ్ము కొట్టుకుపోయి గబ్బిలాలకు నిలయంగా మారుతున్నాయి. ఇక మిథిలా స్టేడియంలోకి వచ్చి పోయే ద్వారాలన్నీ సులభ్ కాంప్లెక్సుగా మారాయని చెప్పక తప్పదు. స్టేడియంలోకి వచ్చివెళ్లేందుకు ఆరుకు పైగా ప్రవేశమార్గాలు ఉండగా ఒకటి మినహా మిగిలిన చోట కనీసం అడుగు పెట్టలేనంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్టీఆర్ హయాంలో స్టేడియం నిర్మాణం
భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవం జరుగుతున్న మిథిలా స్టేడియం నిర్వహణ మేడిపండు చందంగా మారింది. కేవలం శ్రీరామనవమి సమయంలో తప్పితే మిగతా రోజుల్లో దీన్ని పట్టించుకునేవారు లేరు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్‌లో అయినా ౖపైపె మెరుగులతో కాకుండా పూర్తి స్థాయిలో ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులు ఉపయోగించుకునేందుకు అనువుగా మార్చాల్సిన అవసరం ఉంది.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం


