ప్రతీ శ్రీరామనవమికి వినిపిస్తున్న అభివృద్ధి మంత్రం
పుష్కర కాలంగా అమలుకు నోచని పనులు
ఈసారి సీఎం శంకుస్థాపన చేస్తారన్న మంత్రి తుమ్మల
ఉగాది రోజున హైదరాబాద్‌లో కీలక సమావేశం !
విడతల వారీగా అభివృద్ధి ప్లాన్ ఇదే..
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ప్రతీ ఏడాది శ్రీరామనవమి రోజున సీతారామచంద్రస్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వేడుక సమయంలోనే ప్రభుత్వం ఆలయ అభివృద్ధి మంత్రాన్ని పఠించి, ఆ తర్వాత పట్టించుకోదనే విమర్శలు తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచీ వస్తూనే ఉన్నాయి. రూ.100 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామనే మాటలు పుష్కరకాలంగా భక్తులు వింటూనే ఉన్నారు తప్ప ఆచరణ సాధ్యం కాలేదు. అయితే ఈనెల 27న శ్రీరామనవమి రోజున రూ.100 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల చెప్పడంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది.
మంత్రుల ప్రత్యేక దృష్టితో..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రామాలయాన్ని పట్టించుకోలేదని, తాము అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఆ పార్టీ గద్దెనెక్కిన రెండున్నరేళ్లలో మాఢ వీధుల విస్తరణకు భూ సేకరణ ప్రక్రియ మాత్రమే పూర్తయింది. కాగా, ఆలయ అభివృద్ధిపై జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల దృష్టి సారించగా ప్లాన్‌పై కొంతమేర ప్రగతి కనిపిస్తోంది. వారిద్దరూ భద్రాచలంలో పర్యటించిన ప్రతీసారి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్లాన్‌పై అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. అంతేకాక వైదిక పెద్దల అభిప్రాయాల మేరకే ఆలయంలో మార్పులు చేపడుతూ డిజైన్ చేయాలని సూచించారు. దీంతో ఆర్కిటెక్ట్ అధికారులు వైదిక పెద్దలతో పలుమార్లు చర్చించి రూ.350 కోట్లతో మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ఇందులో తొలి విడతగా శ్రీరామనవమి రోజున రూ.100 కోట్ల పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల ఇటీవల ప్రకటించారు.
రేపు కీలక సమావేశం !
భద్రాద్రి రామాలయ మాస్టర్ ప్లాన్‌పై ఈనెల 19వ తేదీ ఉగాది రోజున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఆర్కిటెక్ట్‌లు, దేవాదాయ శాఖ అధికారులతో సెక్రటేరియట్‌లో సమావేశం కానున్నట్లు తెలిసింది. గతంలో ప్రస్తావించిన ప్లాన్‌లో ఆలయ ప్రాంగణంలో పనులపై వైదిక పెద్దలు మార్పులు చూపించారని సమాచారం. ఈ క్రమంలో తుది ప్లాన్ ఖరారు చేస్తారని తెలుస్తోంది.
తొలి విడత : ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, మండపాలు, క్యూ హాళ్లు, ప్రసాద విభాగం, పరిపాలన భవనాల నిర్మాణాలకు రూ.115 కోట్లు అవసరమని ప్రతిపాదించారు.
రెండో విడత : ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల అభివృద్ధి పనుల్లో భాగంగా విస్తా కాంప్లెక్స్, అడ్మిన్ బ్లాక్, ఘాట్లు, రహదారులు ఉన్నాయి. దీనికి రూ. 35 కోట్లుగా అధికారులు సూచించారు.
మూడో విడత : కరకట్ట దిగువ భాగాన గల కాపా రామలక్ష్మమ్మ భూమిని అభివృద్ధి చేయాలని, ఇందులో రామాయణ మ్యూజియం, తూము నర్సింహదాసు ఆడిటోరియం, భక్త రామదాసు ప్లాజా, మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. దీనికి రూ.100 కోట్లు అవసరమని పేర్కొన్నారు.
నాలుగో విడత : ఆలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి చేయాలని, హోటళ్లు, గిరిజన మ్యూజియం, రామవనం, పట్టణ సుందరీకరణ అంశాలను ఇందులో పొందుపర్చారు. దీనికి రూ.100 కోట్లతో ప్లాన్ రూపొందించారు.


