సమన్వయంతో విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో విధులు నిర్వర్తించాలి

Mar 18 2026 9:38 AM | Updated on Mar 18 2026 9:38 AM

భక్తులకు ఇబ్బందులు రానీయొద్దు

కలెక్టర్‌ అంకిత్‌

హైకోర్టు జడ్జిని కలిసిన కలెక్టర్‌

భద్రాచలం : శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని, పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్‌ అంకిత్‌ సూచించారు. మంగళవారం స్థానిక సబ్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను సుందరంగా అలంకరించి ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ముస్తాబు చేయాలని సూచించారు. ప్రధాన రహదారులు, ఆలయ మార్గాల్లో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రత పాటించాలని అన్నారు. తాగునీరు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, హోటళ్లు, అన్నదాన కేంద్రాల్లో నాణ్యతను పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్యాస్‌ సరఫరాలో కొరత లేకుండా ముందస్తుఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 30 పడకలు సిద్ధంగా ఉంచాలని, దర్శన లైన్ల వద్ద ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని, అంబులెన్స్‌లు, రక్త నిల్వలు సిద్ధం చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ రోహిత్‌ రాజు మాట్లాడుతూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, సెక్టార్ల వారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగించాలని పోలీసులకు సూచించారు. అనుమతి లేని ఫ్లెక్సీలు తొలగించి, ఆధ్యాత్మిక వాతావరణానికి అనుగుణంగా మాత్రమే ప్రచార సామగ్రి ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం మిథిలా స్టేడియం, మాఢ వీధులను పరిశీలించారు. సమావేశంలో భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మ్రిణాళ్‌ శ్రేష్ట, ఐటీడీఏ పీఓ రాహుల్‌, ట్రైనీ కలెక్టర్‌ సౌరబ్‌ శర్మ, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్‌, విద్యాచందన, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌ సింగ్‌, దేవస్థానం ఈఓ దామోదర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి

గుండాల : ఏజెన్సీ ప్రాంతంలో నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. మండలంలోని ముత్తాపురం ఏకలవ్య పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌.. పరిసరాలతో పాటు కిచెన్‌ షెడ్‌, వంటశాల అపరిశుభ్రంగా ఉండడం, సిబ్బంది కొరత, కంప్యూటర్‌ ల్యాబ్‌లో దుమ్ము పేరుకుపోవడం, మెనూ ప్రకారం భోజనం అందించకపోవడం వంటి అంశాలను గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ పనితీరు సక్రమంగా లేదని, రెండురోజుల్లో పరిస్థితిని చక్కదిద్దకుంటే ఏజెన్సీ గుర్తింపు రద్దు చేసి బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఆస్పత్రిలో మందుల గది, ల్యాబ్‌, స్టోర్‌ రూమ్‌, రక్త పరీక్ష విభాగాలను పరిశీలించారు. టెస్టులు సక్రమంగా చేస్తూ సకాలంలో వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ ఖాసీం, ఎంపీడీఓ బాలరాజు, ప్రత్యేకాధికారి ఇంతియాజ్‌ ఖాన్‌ తదిరులు ఉన్నారు.

బూర్గంపాడు: హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్‌ మంగళవారం జిల్లా పర్యటనకు రాగా, సారపాక ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్‌ అంకిత్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement