విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నాం

Mar 18 2026 9:38 AM | Updated on Mar 18 2026 9:38 AM

భద్రాచలం : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జీపీఎస్‌, గురుకులాల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ తెలిపారు. ఇక్రిశాట్‌ సైంటిస్టులు మంగళవారం ఏజెన్సీ సందర్శనకు రాగా, పీఓను మర్యాదపూర్వకంగా కలిశారు. గిరిజన గ్రామాల్లోని చిన్నారులకు, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న ఏడు నుంచి పదేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందిచేందుకు ఇక్రిశాట్‌ ఆధ్వర్యంలో పైలట్‌ ప్రాజెక్టును చేపట్టినట్లు సీనియర్‌ సైంటిస్ట్‌ రూప బెనర్జీ, సీనియర్‌ ఆఫీసర్‌ తమిళ్‌ సెల్వి పీఓకు వివరించారు. రక్తహీనత గల చిన్నారులను గుర్తించి న్యూట్రీషన్‌ ఫుడ్‌ అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. చిన్నారులకు బలవర్థక ఆహారం అందించే న్యూట్రిషన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్వాహకులకు చేయూత అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్‌ డేవిడ్‌రాజ్‌, గురుకుల ఆర్‌సీఓ అరుణకుమారి, జేడీఎం హరికృష్ణ పాల్గొన్నారు.

నేడు ఎస్టీ, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన

రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య బుధవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారని పీఓ రాహుల్‌ తెలిపారు. నేడు మధ్యాహ్నం పర్ణశాల శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుంటారని, ఆ తర్వాత ఐటీడీఏలోని గిరిజన మ్యూజియాన్ని సందర్శించి ఐటీసీలో రాత్రి బస చేస్తారని పేర్కొన్నారు. 19న ఉదయం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నాక, పాపికొండల విహారయాత్రకు వెళ్తారని, తిరిగి రాత్రికి ఐటీసీలో బస చేసి 20న ఉదయం హైదరాబాద్‌ వెళ్తారని వివరించారు.

సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన

ఐటీడీఏలో క్వార్టర్లు, ఇతర కార్యాలయాలకు విద్యుత్‌ అంతరాయం లేకుండా సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి పీఓ రాహుల్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఐటీడీఏ పరిధిలోని శివారు కాలనీల్లో లోవోల్టేజీ, విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ఇది దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ మహేందర్‌, డీఈలు జీవన్‌కుమార్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

వైద్యుల సేవలు అభినందనీయం

పాల్వంచ: పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అభినందనీయమని పీఓ రాహుల్‌ అన్నారు. మంగళవారం ఆయన ఆస్పత్రిలోని ల్యాబ్‌, ఫార్మసీ, బ్లడ్‌ స్టోరేజీ సెంటర్‌, మెడికల్‌ వార్డును పరిశీలించారు. ఇటీవల మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స పొందిన కవితను పరామర్శించారు. అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు డాక్టర్‌ శైలేష్‌ కుమార్‌, డాక్టర్‌ రాంప్రసాద్‌ను సత్కరించారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ సోమరాజు దొర, సిబ్బంది పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement