సూపర్‌బజార్(కొత్తగూడెం): తమ భూ సమస్య పరిష్కరించాలంటూ అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఆదివాసీలు కలెక్టరేట్ ధర్నాచౌక్‌లో చేపట్టిన ఆత్మగౌరవ నిరవధిక నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. రెవెన్యూ, అటవీ అధికారులతో ఉద్యమకారులు మంగళవారం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో దీక్షలు కొనసాగించాలని ఆదివాసీలు నిర్ణయించారు. దీనిపై కొత్తగూడెం ఆర్డీఓ మధు మాట్లాడుతూ.. ఆదివాసీలు డిమాండ్ చేస్తున్న 573 ఎకరాలు రెవెన్యూ పరిధిలో లేవని, మిగిలిన 400 ఎకరాల భూమి మాత్రమే తమ శాఖ పరిధిలో ఉందని తెలిపారు. అందులో 250 ఎకరాలకు గతంలో పట్టాలిచ్చామని, మిగిలిన 150 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గతంలో సర్వే చేశామని చెప్పారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మరోసారి పారదర్శంగా సర్వేచేసి పాస్‌బుక్, సాగులో ఉన్న భూములను గుర్తించి అర్హులకు పట్టాల పంపిణీ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. రామన్నగూడెం సర్పంచ్, ఉద్యమకారుల సంఘం నాయకుడు మడకం నాగేశ్వరరావు మాట్లాడుతూ భూసమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. 180 మందితో కలిసి దీక్షలు చేస్తున్నామని, 573 ఎకరాలు తమకు పంపిణీ చేయాలని అధికారులను కోరారు.


