19 నుంచి బ్రహ్మోత్సవాలు
శ్రీరామవనమి ఉత్సవాల పనులు జోరందుకున్నాయి. భద్రగిరి వీధులు శ్రీ సీతారాముల కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. మరో రెండు రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, రామయ్య పెళ్లి పనులు చకచకా సాగుతున్నాయి. సోమవారం ఆఫ్‌లైన్‌లో కూడా కల్యాణ టికెట్ల విక్రయాలను ప్రారంభించారు. – భద్రాచలం
● భద్రగిరిలో శ్రీరామనవమి సందడి ● మిథిలా స్టేడియంలో ముమ్మరంగా ఏర్పాట్లు ● మరో రెండు రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వీఐపీలకు పెళ్లి పిలుపులు
ఈ నెల 27న శ్రీ సీతారాముల కల్యాణం, 28న పట్టాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గోడ పత్రికలను, ఆహ్వాన పత్రికలను ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఆలయ అధికారులు ఉత్సవాలకు వీఐపీలను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, స్థానిక ఏఎస్‌పీ, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు అందజేశారు. సోమవారం కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, భద్రాచలం జ్యుడీషియల్ జడ్జి శివనాయక్ తదితరులకు ఆలయ ఈఓ దామోదర్‌రావు ఆహ్వాన పత్రికలు ఇవ్వగా పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ నెల 19న ఉగాది తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్లకు ఆహ్వాన పత్రికలు అందించనున్నారు.
ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయం ప్రారంభం
శ్రీరామనవమి వీక్షణ టికెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో విక్రయిస్తుండగా, సోమవారం ఆఫ్‌లైన్ విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఆలయ ఈఈ రవీందర్ ప్రారంభించారు. దేవస్థానంలోని ప్రధాన కౌంటర్, తానీషా కల్యాణ మండపంలోని సీఆర్‌వో కార్యాలయం వద్ద, బ్రిడ్జి పాయింట్ వద్ద నున్న సీఆర్‌వో, భద్రాచలం సబ్ కలెక్టరేట్ కార్యలయం వద్ద కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉభయ దాతలతోపాటు ఇతర సెక్టార్‌ల టికెట్లను విక్రయించనున్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులు ఈ నెల 20 నుంచి 27వ తేదీ ఉదయం 6గంటల వరకు ధ్రువీకరణ పత్రాలతో టికెట్లు పొందాలని ఆలయ అధికారులు తెలిపారు. ఇక మిథిలా స్టేడియంలోని పనులు చకచకా సాగుతున్నాయి. స్టేడియం నిండా షామియానాల ఏర్పాటుకు పెండిలమ్ వర్క్ పూర్తయింది. సీఎం, ఇతర సెక్టార్ల విభజన పనులు కొనసాగుతున్నాయి. బారికేడ్లు, ఇనుప కంచె పనులు సాగుతుండగా, పెయింటింగ్ పనులు ముగిశాయి. స్వాగత ద్వారాల ఏర్పాటుతో భద్రాచలంలో నవమి శోభ ముందస్తుగానే సంతరించుకుంది.
ఈ నెల 19న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఏప్రిల్ 2న ముగియనున్నాయి. 27న శ్రీ రామ పునర్వసు దీక్ష ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 24న ముగియనుంది. 19న ఉగాది పర్వదినం రోజున బ్రహ్మోత్సవాలకు రక్షాబంధనం, స్నప న తిరుమంజనం, మృత్సంగ్రహణంతో అంకురార్పణ చేయనున్నారు. 23న మండల లేఖ, కుండ, కలశ, యాగశాల, అలంకరణాదులతో పాటుగా సార్వభౌమ సేవ జరగనుంది. 24న గరుడధ్వజపట లేఖనం, గరుడధ్వజపటావిష్కరణ, గరుడధ్వజాధివాసం, 25న అగ్ని ప్రతిష్ట, ధ్వజా రోహణం, దేవతాహ్వానం, బలిసమర్పణం, హనుమద్వాహన సేవలు నిర్వహించనున్నారు. 26న యాగశాల పూజ, చుతుఃస్థానార్చనం, గజ,గరుడ వాహన సేవలు, ఎదుర్కోలు ఉత్సవం, 27న ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు సీతారాముల తిరు కల్యాణోత్సవం, చంద్రప్రభ వాహన సేవ, 28న పట్టాభిషేకం, రథోత్సవం జరగనున్నాయి. 29న సదస్యం, 30న తెప్పోత్స వం, చోరోత్సవం, 31న ఊంజల్ సేవ, ఏప్రిల్ 1న వసంతోత్సవం, 2న పూర్ణాహుతి, ధ్వజావరోహణం, పుష్పయాగంలతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు.


