పోటెత్తారు.. | - | Sakshi
Sakshi News home page

పోటెత్తారు..

Mar 17 2026 7:38 AM | Updated on Mar 17 2026 7:38 AM

● గ్రీవెన్స్‌ డే కార్యక్రమానికి విశేష స్పందన ● సమస్యలు చెప్పుకునేందుకు బారులు దీరిన ప్రజలు ● ఏడాది కాలంపాటు ఆగుతూ సాగిన కార్యక్రమం

తరలివచ్చిన

రామన్నగూడెం గిరిజనలు

ప్రజావాణికి
● గ్రీవెన్స్‌ డే కార్యక్రమానికి విశేష స్పందన ● సమస్యలు చెప్పుకునేందుకు బారులు దీరిన ప్రజలు ● ఏడాది కాలంపాటు ఆగుతూ సాగిన కార్యక్రమం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను చెప్పుకునేందుకు జిల్లా అధికారుల కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)కి ప్రజలు పోటెత్తారు. గోదావరి వరదలు, వర్షాలు, వరుసగా వచ్చిన ఎన్నికల కారణంగా ఏడాది కాలంగా ఐడీఓసీ(కలెక్టరేట్‌)లో జరిగే గ్రీవెన్స్‌ డే నిస్తేజంగా మారిపోయింది. మండల, డివిజన్‌ స్థాయిలకే పరిమితమైంది. ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్‌ ఐడీవోసీలో గ్రీవెన్స్‌డేను తిరిగి ప్రారంభించారు.

ఉదయం 10 గంటల నుంచే..

సోమవారం ఉదయం పది గంటలకే పలువురు బాధితులు ఐడీఓసీకి చేరుకున్నారు. తొలుత అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రవీంద్రనాథ్‌లు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించడం మొదలు పెట్టారు. ఉదయం 11:30 గంటలకు కలెక్టర్‌ గ్రీవెన్స్‌కు చేరుకోగా ఒక్కసారిగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు క్యూలైన్లలో నిల్చున్నారు. మధ్నాహ్నం రెండు గంటల వరకు విజ్ఞప్తులను స్వీకరించారు. కాగా, ఐడీఓసీలో క్యాంటీన్‌ సోమవారం తెరుచుకోకపోవడం వల్ల ఇక్కడికి వచ్చిన వారు ఇబ్బంది పడ్డారు. గ్యాస్‌ కొరత కారణంగానే క్యాంటీన్‌ ఓపెన్‌ చేయలేదని తెలుస్తోంది.

నా బిడ్డను ఆదుకోండి..

పాల్వంచలోని సబ్‌స్టేషన్‌ ఏరియాకు చెందిన పి.దేవి తన ఐదేళ్ల కూతురు తనూషతో కలెక్టరేట్‌కు వచ్చింది. తన కూతురు జన్మతహా ఎంఆర్‌ సెలబ్రల్‌ పల్సీ అనే వ్యాధితో బాధపడుతోందని, శారీరక, మానసిక ఎదుగుదల లేదని, వైద్యానికి ప్రతీ నెల రూ. 50వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని కలెక్టర్‌కు మొరపెట్టుకుంది. కలెక్టర్‌ ఆదేశాలతో గ్రీవెన్స్‌లోనే ఉన్న డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారాం రాథోడ్‌, పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ వీరబాబులు పాపను పరిశీలించారు. మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు రిఫర్‌ చేస్తామని తెలిపారు. పాపకు దివ్యాంగురాలు సర్టిఫికెట్‌తోపాటు పింఛన్‌ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన 180 కుటుంబాలు మరోసారి ఐడీఓసీ ఎదుట నిరవధిక దీక్షకు దిగాయి. సర్వే నంబరు 30, 33, 39లలో ఉన్న 573 ఎకరాల భూమి విషయంలో గ్రామస్తులు, ఫారెస్టు శాఖకు మధ్య 2011లో వివాదం రాజుకుంది. దీనిపై ఫారెస్ట్‌, రెవెన్యూ శాఖలు జాయింట్‌ సర్వే చేపట్టి 2012లో రిపోర్టు ఇచ్చారు. రిపోర్టు ప్రకారం తమకు న్యాయం చేయాలంటూ రామన్నగూడెంవాసులు గతేడాది ఆగస్టులో పాదయాత్రగా కలెక్టరేట్‌కు చేరుకుని 9 రోజులపాటు రేయింబవళ్లు నిరవధిక దీక్ష చేపట్టారు. దీంతో సమస్య పరిష్కారానికి అప్పటి కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌ హామీ ఇచ్చారు. ఆరు నెలలు కావొస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం మళ్లీ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. నిరవధిక దీక్ష చేపట్టేందుకు వీలుగా టెంట్‌, వంట సామన్లు, చద్దర్లు, దుప్పట్లు, కంచాలు వాహనాల్లో తరలించుకుని వచ్చారు. ఐదేళ్ల చిన్నారి నుంచి డైబ్బె ఏళ్ల వృద్ధుల వరకు ఊరంతా దీక్షకు హాజరవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement