సూపర్‌బజార్(కొత్తగూడెం): తమ భూసమస్య పరిష్కరించాలని రామన్నగూడెం ఆదివాసీలు సోమవారం కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో ఆత్మగౌరవ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. పిల్లా పాపలతో ఆదివాసీ కుటుంబాలు దీక్షలో పాల్గొంటున్నాయి. గతంలో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ఇచ్చిన హామీని నెరవేర్చక పోవడంతో దీక్షలను మళ్లీ ప్రారంభించినట్లు ఉద్యమ నాయకుడు మడకం నాగేశ్వరరావు తెలిపారు. అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్లు 30, 36, 39లలో ఉన్న ఆదివాసీల పట్టా భూములకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ 2012 ఆగస్టు 31న ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భద్రాద్రి కలెక్టర్ 2025 సెప్టెంబర్ 29న ఇచ్చిన ఆర్డర్ ప్రకారం 2025 అక్టోబర్ 10 నుంచి రెవెన్యూ, అటవీ శాఖ సంయుక్తంగా సర్వే చేసి పంచనామా నిర్వహించిన భూములను ఆదివాసీ రైతులకు అప్పగించాలనే డిమాండ్‌తో ఆందోళన చేపట్టారు. ఆదివాసీ రైతులపై తప్పుడు ప్రచారం చేసిన అటవీ శాఖాధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్కమ్మ చెరువు వరద కాలువల నష్ట పరిహారం 2013 భూసేకరణ ప్రకారం మంజూరు చేసి ఆదివాసీ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాత్రి కలెక్టర్ అంకిత్‌ను కలిసి సమస్యు వివరించి వినతిపత్రం అందించగా వెంటనే అటవీ, రెవెన్యూ అధికారులకు ఫోన్ చేశారని రాత్రి వరకు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారని నాగేశ్వరరావు తెలిపారు. రాత్రి 10.30 వరకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో దీక్షను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాగా మంగళవారం ఉద్యమ ప్రతినిధులు, అటవీ, రెవెన్యూ ప్రతినిధులు కలెక్టరేట్‌లో సమావేశమై పరిష్కార చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రామన్నగూడెంవాసుల ఆత్మగౌరవ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం


