అశ్వారావుపేటరూరల్: మండల పరిధిలోని వినాయకపురం గ్రామ శివారులో వేంచేసియున్న శ్రీ చిలకలగండి ముత్యాలమ్మతల్లి జాతర ఉత్సవాలు మంగళవారం నుంచి శనివారం వరకు ఐదు రోజులపాటు వైభవంగా సాగనున్నాయి. ఉత్సవాలకు అశ్వారావుపేట, దమ్మపేట మండలాలతోపాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి, వేంసూరు, ఏపీలోని ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, చింతలపూడి, టీ నర్సాపురం ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఉగాది పర్వదినం రోజున దాదాపు రెండు లక్షల మంది భక్తులు హాజరు అవుతారని అంచనా. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ సూర్యప్రకాశ్‌రావు, పాలక మండలి చైర్మన్ నరాల శ్రీనివాసరావు ఏర్పాట్లు పూర్తి చేవారు. జాతర నేపథ్యంలో అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.22.63 లక్షలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ హుండీ కానుకలను సోమవారం లెక్కించారు. 52 రోజులకు గానూ రూ.22,63,330 ఆదాయం లభించిందని దేవాదాయ శాఖ పరిశీలకులు రెంటాల సమత, ఆలయ ఈఓ కె. జగన్మోహన్‌రావు తెలిపారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ పాల్గొన్నారు.


