ఖమ్మంమయూరిసెంటర్: సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, పార్టీ శ్రేణులు ఆందోళన చెందొద్దని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స అందించిన వైద్యులు సోమవారం క్యాజువాలిటీ వార్డులోకి మార్చారు. ఊపిరితిత్తుల సమస్య, మూత్రపిండాల్లో క్రియాటిన్ లెవెల్స్ పెరగడం, రెండుసార్లు గుండెపోటుకు గురికావడం తదితర అనారోగ్య కారణాలతో ఆయనను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారని వెల్లడించారు. మరో రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాగా, తమ్మినేనిని నున్నా నాగేశ్వరరావుతో పాటు సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్, అన్నవరపు కనకయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నవీన్ రెడ్డి, నాయకులు వీరబాబు తదితరులు పరామర్శించారు.


