రిటైనింగ్‌.. రైట్‌ రైట్‌! | - | Sakshi
Sakshi News home page

రిటైనింగ్‌.. రైట్‌ రైట్‌!

Mar 17 2026 7:38 AM | Updated on Mar 17 2026 7:38 AM

● వాల్‌ నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ ● ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే వేగంగా పనులు ● మిగతా చోట్ల భూసేకరణకు జీఓ జారీ ● త్వరలోనే నిర్వాసితులకు భూమి, ప్లాట్లు పనుల్లో మరింత వేగం

ఎకరం భూమికి 690 గజాల ప్లాట్‌

● వాల్‌ నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ ● ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే వేగంగా పనులు ● మిగతా చోట్ల భూసేకరణకు జీఓ జారీ ● త్వరలోనే నిర్వాసితులకు భూమి, ప్లాట్లు

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం నగరంలో మున్నేరు నదికి ఇరువైపులా రూ.690 కోట్లతో 18 కిలో మీటర్ల మేర చేపట్టిన రిటైనింగ్‌ వాల్‌ పనులకు భూసేకరణ సమస్య కొలిక్కి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ జారీ చేయడంతో పనులు శరవేగంగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. మొత్తం 18 కి.మీ. మేర నిర్మించే వాల్‌ పనుల్లో భూ సమస్యలు లేని, ప్రభుత్వ భూముల పరిధిలో 10 కి.మీ. పరిధిలో పనులు చేపట్టగా 50 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 8 కి.మీ. పరిధిలో నిర్మాణానికి పట్టా భూములు, ప్లాట్లు కూడా సేకరించాల్సి రావడంతో జాప్యం జరిగింది. దీంతో పాటు నగరంలో వరద నీరు మున్నేరులోకి వచ్చేలా సైడ్‌ డ్రెయిన్లు నిర్మించాల్సి ఉంది. భూ సమస్యకు పరిష్కారం లభిస్తే వర్షాలు, వరద ప్రభావం లేని ఈ నాలుగు నెలల్లో అత్యధిక శాతం పనులు జరిగే అవకాశం ఉంది.

మిగులు భూమి వినియోగం

రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంలో భూములు, ప్లాట్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఖమ్మం రూరల్‌ మండలం పోలేపల్లి గ్రామ సమీపంలో సాగర్‌ మిగులు భూమిగా ఉన్న 125 ఎకరాలను జలవనరుల శాఖ అవసరాలకు వినియోగించుకునేలా జీఓ నం.128 జారీ చేియడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.53 కోట్లు కూడా విడుదల చేసింది. ఇక రెవెన్యూ పరంగా సర్వే చేసి ఎంత మేర భూమి సేకరించాలి, ఎంతమందికి పట్టాలు ఇవ్వాలి, కేటాయించిన భూమిలో లే ఔట్‌ చేయడం వంటి పనులు జరగాల్సి ఉంది. దీనిపై ఇటీవల కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు.

మున్నేరు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరుగుతుంది. భూ సేకరణకు కూడా ప్రత్యామ్నాయ భూమి కేటాయిస్తూ జీఓ వచ్చింది. ఇప్పటికే 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు త్వరలోనే పూర్తి చేస్తాం.

– మంగళపూడి వెంకటేశ్వర్లు,

ఎస్‌ఈ, జలనవరుల శాఖ

రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంలో భూములు, ప్లాట్లు కోల్పోయే బాధితులు సుమారు 750 మందికి పైగా ఉన్నారని అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. పట్టా భూమి కోల్పోయే రైతులకు ఎన్నెస్పీ మిగులు భూమిలో ఎకరం భూమికి బదులు 690 గజాల స్థలం కేటాయించేలా ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే ప్లాట్లు కోల్పోయే వారికి వారి విస్తీర్ణాన్ని బట్టి 75 గజాలు, 100 గజాలు, 300 గజాల చొప్పున ఇవ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలేపల్లి సమీపంలోని భూమిలో లే ఔట్‌ రూపొందించి అభివృద్ధి పనులకు సిద్ధం చేసినట్లు సమాచారం. అన్ని అనుమతులు పూర్తయ్యాక నిబంధనల ప్రకారం ఆ భూమిని అభివృద్ధి చేసి భూములు కోల్పోయిన పట్టాదారులు, ప్లాట్‌ యజమానులకు స్థలాలు కేటాయించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే మున్నేరు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు మరింత వేగంగా సాగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement