బడ్జెట్‌పైనే ఆశలు.. | - | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌పైనే ఆశలు..

Mar 16 2026 7:35 AM | Updated on Mar 16 2026 7:35 AM

సీతారామ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేనా ?

పర్యాటకరంగంపై దృష్టి పెడితే

కొత్త పుంతలు

సాగునీటి రంగానికి ప్రాధాన్యత

ఇవ్వాలంటున్న రైతులు

నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాల

నేపథ్యంలో చిగురిస్తున్న ఆశలు

‘ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నిధులు వస్తాయి.. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి.. రహదారులు కొత్త రూపు సంతరించుకుంటాయి.. స్థానిక సమస్యలు పరిష్కారం అవుతాయి..’ అని ప్రజలు సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు, ఖమ్మంలో రిటైనింగ్‌ వాల్‌, మున్నేరుపై తీగల వంతెన పనులు సాగుతున్నాయి. అలాగే పర్యాటక రంగ అభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటన్నింటికీ నిధులు కేటాయిస్తే ఈ ఏడాదే పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం

సీతారామకు ప్రాధాన్యత దక్కేనా..?

ఉమ్మడి జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ప్రాధాన సాగునీటి వనరుగా ఉంది. గతంలో దీని అంచనా వ్యయం రూ.19,324 కోట్లు కేటాయించారు. అలాగే రిజర్వాయర్‌తోపాటు పాలేరు లింక్‌ కెనాల్‌ పనులు చేపట్టారు. మరోవైపు కొత్త కాల్వల తవ్వకానికి అనుమతులిచ్చారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ప్రధానంగా మారింది. అలాగే జిల్లాలో యాతాలకుంట, తిరుమలాయపాలెం తదితర ప్రాంతాల్లో టన్నెల్‌ నిర్మాణాలు పూర్తి కావాలి. గతేడాది బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు (ఖమ్మం సీఈ పరిధిలో) రూ.643.04 కోట్లు కేటాయించారు. ఈసారి బడ్జెట్‌లో ఎంత మేరకు కేటాయింపులు ఉంటాయో తేలాల్సి ఉంది.

నిధుల వరద పారాలి..

ఎర్రుపాలెం వద్ద ఎన్నెస్పీపై లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను సర్కారు చేపట్టింది. గతేడాది బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.39.90 కోట్లు కేటాయించారు. దీన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈసారి ఎన్ని నిధులు కేటాయిస్తారో వేచి చూడాల్సిందే. అలాగే జిల్లాలోని పలు ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు గురయ్యాయి. ఇందుకోసం నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. ఇక లంకాసాగర్‌, వైరా, తాలిపేరు తదితర ప్రాజెక్టులకు పలు రకాల పనుల నిమిత్తం నిధులు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది.

రిటైనింగ్‌ వాల్‌, తీగల వంతెన పూర్తయితే ..

ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ఖమ్మం నగరలోని మున్నేరుకు వచ్చే వరదతో పరీవాహక ప్రాంతంలోని ఖమ్మం రూరల్‌ మండలం, నగరంలోని కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. 2023లో వరదల సమయంలోనే మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించి రూ.690 కోట్లు కేటాయించింది. ఇరువైపులా 8.50 కి.మీ. చొప్పున 17 కి.మీ. గోడ నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం రూరల్‌ మండల పరిధిలో 6 కి.మీ. మేరకు, ఖమ్మం నగరం వైపు 3 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. అయితే భూసేకరణ సమస్యతో పనులు కొంత ఆలస్యమయ్యాయి. ఇటీవల కేబినెట్‌ సమావేశంలో 125 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం అనుమతించింది. మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కూడా పూర్తి కావాల్సి ఉంది. ఈ రెండింటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే పనులు చకచకా పూర్తయి ఖమ్మానికి కత్త కళ రానుంది.

పర్యాటకాభివృద్ధికి అవకాశం..

ఉమ్మడి జిల్లాలో పర్యాటకులను ఆకట్టుకునే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వీటి అభివృద్ధికి ప్రణాళికతోపాటు నిధులు కేటాయిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యాటక రంగంలో దూసుకుపోనుంది. కనకగిరి గుట్టలు, నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం, పలు జలపాతాలు, జమలాపురం వంటి పుణ్యక్షేత్రాలు పర్యాటక రంగానికి ఊతమివ్వనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement