శక్తినిచ్చే గంజి, హలీం.. | - | Sakshi
Sakshi News home page

శక్తినిచ్చే గంజి, హలీం..

Mar 16 2026 7:35 AM | Updated on Mar 16 2026 7:35 AM

12 గంటలు ఉడికించాలి అలసట దూరం..

హలీంలో అనేక పోషకాలు

ఉపవాసం విరమించాక స్వీకరిస్తున్న ముస్లింలు

రుచి, పోషక ఆహారం కావడంతో అందరికీ ఆసక్తే

రంజాన్‌ మాసంలో నోరూరించే ప్రత్యేక వంటకాలు

కరకగూడెం: పవిత్రమైన రంజాన్‌ మాసంలో సాయంత్రం వేళ ఇఫ్తార్‌ సమయం సమీపించగానే మసీదుల పరిసరాల్లో గంజి, హలీం వంటకాలు నోరూరిస్తున్నాయి. ముస్లింలు ఉపవాసం విరమించే సమయంలో గంజి, హలీం తీసుకుంటున్నారు. జిల్లాలోని అనేక మసీదుల్లో దాతల సహకారంతో పెద్ద గిన్నెల్లో (దేగుల్లో) వేడివేడి గంజిని వండి ఇఫ్తార్‌ సమయానికి సిద్ధం చేస్తున్నారు. ఉపవాసం ఉన్నవారితోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే పేదలు, బాటసారులకు కూడా గంజిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

రుచి, ఆరోగ్యం

గంజి, హలీం వంటకాలు రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. రోజంతా ఉపవాసం ఉన్న శరీరాన్ని తిరిగి శక్తిమంతం చేస్తాయి. గంజి తక్షణ శక్తిని అందిస్తుంది. రోజంతా నీరు తాగకుండా ఉండటం వల్ల కలిగే అలసట, డీ హైడ్రేషన్‌ను తగ్గిస్తాయి. బియ్యపు రవ్వ, పెసరపప్పుతో తయారు చేసే ఈ వంటకం తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో కలిపే అల్లం, పుదీనా, కొత్తిమీర వంటి పదార్థాలు శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. అందువల్ల ఉపవాసం విరమించాక గంజి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు కూడా సూచిస్తున్నారు.

హలీం తయారీకి ఎంతో కష్ట పడాలి. రోజూ తెల్ల వారుజామునే పనులు మొదలుపెట్టి దాదాపు 10 నుంచి 12 గంటల పాటు కట్టెల పొయ్యి మీద సన్నని మంటపై మటన్‌, గోధుమలు, నెయ్యి మరియు సుగంధ ద్రవ్యాలను ఉడికిస్తాం. హలీం మెత్తగా, వెన్నలా రావాలంటే గంటల తరబడి కరల్రతో కలియతిప్పాలి. సాయంత్రం ఇఫ్తార్‌ సమయానికి సిద్ధం చేస్తాం. ముస్లింలే కాకుండా అన్ని వర్గాల వారు ఈ రుచిని ఇష్టపడతారు.

– ఎండీ రఫీ, జే హోటల్‌, పాల్వంచ

రోజంతా ఉపవాసం ఉండి, ఇఫ్తార్‌ సమయంలో వేడి గంజి తీసుకున్నప్పుడు ఒంటికి వెంటనే శక్తి వచ్చి అలసట దూరమవుతుంది. ఇదికాక సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో కూడిన హలీం తింటే శరీరానికి బలం వస్తుంది. ఆకలి తీర్చుకోవడమే కాదు కులమతాలకు అతీతంగా కలిసి కూర్చుని రుచులను ఆస్వాదించడం మనుషుల మధ్య ఐక్యత చాటిచెబుతోంది.

– సయ్యద్‌ ఆరిఫ్‌, కరకగూడెం

రంజాన్‌ మాసం వచ్చిందంటే గుర్తుకు వచ్చే మరో ప్రత్యేక వంటకం హలీం. మాంసం, గోధుమలు, పప్పు దినుసులతో గంటల తరబడి మగ్గించి తయారు చేసే ఈ వంటకంలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రోటీన్లు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రోజంతా ఉపవాసం వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందడంలో ఇది సహాయపడుతుంది. ఎముకలతో కలిపి మగ్గించడం వల్ల కాల్షియం కూడా లభిస్తుంది. నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌ కలపడం వల్ల శరీరానికి అవసరమైన కొవ్వు లభిస్తుంది. అందుకే రంజాన్‌లో హలీం ఇఫ్తార్‌ విందుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సాధారణంగా మటన్‌ హలీం ప్లేట్‌ రూ.120 నుంచి రూ.150 వరకు, చికెన్‌ హలీం ప్లేట్‌ రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. కుటుంబ సభ్యులు కలిసి ఆస్వాదించేందుకు ఫ్యామిలీ ప్యాక్‌ ధర రూ.600 నుంచి 800 వరకు ఉంది. హలీం తయారీకి పలువురికి ఉపాధి కూడా దొరుకుతుంది.

మసీదు ప్రాంగణాల్లో ఇఫ్తార్‌ వేళల్లో రెడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement