పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్ ద్వారాఅమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి,ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పేర్కొన్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారానికి సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని, అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక దరఖాస్తులను అందజేయాలని సూచించారు.
కిన్నెరసానిలో
పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్‌పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 293 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.17,010 ఆదాయం లభించింది. 170 మంది బోటుషికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.10,160 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
వ్యాపారులు సహకరించాలి
భద్రాచలంటౌన్: గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ఏర్పాటు చేస్తున్న భద్రగిరి మార్ట్ విజయవంతానికి స్థానిక వ్యాపారులు సహకరించాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ కోరారు. ఐటీడీఏ కార్యాలయంలో ఆదివారం స్థానిక వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు వేణు, ప్రభాకర్ రావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘షబ్–ఏ–ఖదర్’
కరకగూడెం: పవిత్ర రంజాన్ మాసం కావడంతో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్నారు. గత నెల 19 నుంచి ఉపవాస దీక్షలు పాటిస్తున్నారు. నేడు (సోమవారం) రాత్రి మసీదుల్లో ప్రత్యేక జాగారం చేయనున్నారు. రంజాన్ మాసం చివరి పది రోజుల్లో వచ్చే ఐదు బేసి రాత్రుల్లో ఒకటైన ఈ రాత్రికి ఇస్లాంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ రాత్రి చేసే ప్రార్థనలు వెయ్యి మాసాల ప్రార్థనల కంటే ఎక్కువ పుణ్యఫలాన్ని ఇస్తాయని ముస్లింలు విశ్వసిస్తారు. జిల్లా వ్యాప్తంగా 110 మసీదులు ఉండగా, సుమారు 80 వేల మంది ముస్లింలు ఉన్నారు. జాగారం చేసేందుకు మసీదులను ముస్తాబు చేశారు. రాత్రంతా మేల్కొని ఖురాన్ పఠించనున్నారు.


