భద్రాచలంటౌన్: భద్రాచలంలో గోదావరి స్నానఘట్టాల వద్ద పాప విమోచన ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం నిర్వహించిన నదీహారతి కార్యక్రమం కనుల పండువగా సాగింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హైదరాబాద్‌కు చెందిన శ్రీ వాగ్దేవి కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నాదోపాసన, కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీత కచేరి భక్తులను ఆకట్టుకున్నాయి. పురోహితులు గణపతి పూజ, దీపోత్సవం నిర్వహించి గోదావరి మాతకు, శ్రీరామునికి అష్టోత్తర శతనామార్చన చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ దామోదర్ రావు, సర్పంచ్ పునెం కృష్ణ దొర, డీఈ రవీందర్, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, పురోహితులు సురేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
10 గంటలపాటు కీర్తనల ఆలాపన
భద్రగిరి రామయ్య సన్నిధిలో ఆదివారం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం చోటుచేసుకుంది. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ చిత్రకూట మండపంలో అల్లం రమాదేవి నిర్విరామంగా 10 గంటలపాటు 108 భక్తి సంకీర్తనలు ఆలపించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. ఆమె ప్రతిభను గుర్తించిన ‘తెలంగాణ స్టేట్ రికార్డ్స్’ ప్రతినిధులు రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. రమాదేవి దంపతులను ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, ఈఓ సత్కరించి సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. డాక్టర్ చింతపట్ల వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా నిత్యకల్యాణం
భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్ల కీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రామయ్య కల్యాణానికి గోటి తలంబ్రాలు
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి కల్యాణోత్సవానికి శ్రీ రామదాసు భక్త మండలి (చెల్పూర్) ఆధ్వర్యంలో ఆదివారం గోటి తలంబ్రాలను సమర్పించారు. సేంద్రియ పద్ధతిలో పండించి, గోటితో ఒలిచిన 2.10 క్వింటాళ్ల తలంబ్రాలను వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ఈఓ దామోదర్‌రావుకు అందజేశారు. అనంతరం నిత్య అన్నప్రసాదం కోసం భక్తుల నుంచి సేకరించిన 14 క్వింటాళ్ల బియ్యాన్ని తానీషా భవనంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో 400 మంది మహిళా భక్తులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.


