జనగణన సమర్థంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

జనగణన సమర్థంగా నిర్వహించాలి

Mar 16 2026 7:35 AM | Updated on Mar 16 2026 7:35 AM

● ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి ● శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్‌ అంకిత్‌

● ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి ● శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్‌ అంకిత్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జనాభా గణన–2027 కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ అంకిత్‌ అధికారులకు సూచించారు. జనగణనలో భాగంగా మొదటి దశ అయిన గృహాల జాబితా, గృహ వసతుల గణనపై అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠతో కలిసి కలెక్టరేట్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15, 16, 17 తేదీల్లో శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనాభా గణనలో విధి విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. డేటా సేకరణ సమయంలో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు. జనగణన ద్వారా సేకరించే గణాంకాలు గ్రామ, పట్టణ, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు పునాది వంటివని అన్నారు. పాఠశాలలు, ఆస్పత్రులు, రహదారులు, తాగునీటి సదుపాయాలు వంటి మౌలిక వసతుల కల్పనకు, సంక్షేమ పథకాలు అర్హులకు చేరవేసేందుకు ఉపయోగపడతాయని అన్నారు. ఈసారి జనాభా లెక్కలు పూర్తిగా మొబైల్‌ యాప్‌ ద్వారా సేకరిస్తున్నట్లు తెలిపారు. పౌరులు తమ వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం కూడా కల్పించనున్నట్లు చెప్పారు. మొదటి దశలో ఇళ్ల జాబితా సేకరణ, రెండో దశలో జనాభా వివరాల సేకరణ జరుగుతాయని వివరించారు. గృహ నిర్మాణం, నీటి వనరు, మరుగుదొడ్డి, విద్యుత్‌, వంట ఇంధనం, ఇంటర్నెట్‌ సౌకర్యం వంటి 33 అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాల్సి ఉంటుందనానరు. ఈ శిక్షణ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీఓ మధు, గణాంక అధికారి ఉదయ భాస్కర్‌, ఈడీఎం సైదేశ్వర రావు, మాస్టర్‌ ట్రైనర్లు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement