ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ మహేందర్
అశ్వారావుపేటరూరల్: నాణ్యమైన, నిరంతర విద్యుత్ సేవలు అందిస్తామని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ(ఆపరేషన్) జి.మహేందర్ తెలిపారు. మండలంలోని వినాయకపురం గ్రామంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యాన్ని 3.15 ఎంవీఏ నుంచి 5 ఎంవీఏ సామర్థ్యానికి పెంచారు. నారాయణపురం సబ్ స్టేషన్ నుంచి కావడిగుండ్ల గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్‌కు 17 కిలోమీటర్ల మేర 33 కేవీ విద్యుత్ లైన్ పనులు పూర్తయ్యాయి. వీటిని ఆదివారం ఎస్‌ఈ ప్రారంభించి మాట్లాడారు. వేసవి కాలం నేపథ్యంలో వినాయకపురం సబ్ స్టేషన్ పరిధిలో లోఓల్టేజీ సమస్య ఉత్పన్నం రాకుండా పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచామని తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కావడిగుండ్ల పరిధిలో కూడా వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ సేవలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఈలు నందయ్య, వెంకటేశ్వర్లు, ఏడీఈలు బి.వెంకట రత్నం, రాంబాబు, మధు, ఏఈలు విజయ్ కృష్ణ, నరసింహారావు పాల్గొన్నారు.


