పాల్వంచ: ఈనెల 11, 12వ తేదీల్లో సంగారెడ్డి–హైదరాబాద్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యా డ్మింటన్ పోటీల్లో భద్రాద్రి క్రీడాకారులు ప్రతిభ కనబర్చినట్లు శనివారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ వాసిరెడ్డి నరేష్ తెలిపారు. అండర్–17 బాలుర విభాగంలో పాల్వంచకు చెందిన పి.నోయల్ విన్సెంట్, జాఫర్, షరీఫ్, కొత్తగూడేనికి చెందిన ఎం.రిషికుమార్, భద్రాచలానికి చెందిన తుషార్ మనస్, ఎ.వినయ్‌లు సత్తాచాటి బ్రాంజ్ మెడల్ సాధించారని, వీరు ఏప్రిల్‌లో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈమేరకు క్రీడాకారులను డీఈఓ బి.నాగలక్ష్మి, డీవైఎస్‌ఓ పరంథామరెడ్డి, ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ వాసిరెడ్డి నరేష్ తదితరులు అభినందించారు.
ఏకలవ్య పాఠశాలల మెరిట్ జాబితా విడుదల
భద్రాచలంటౌన్: ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏకలవ్య మోడల్ గిరిజన పాఠశాలల్లో బోధనేతర (ఔట్‌సోర్సింగ్) సిబ్బంది భర్తీకి తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేసినట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. గతేడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతో జాబితాను భద్రాచలం ఐటీడీఏ ఆవరణలోని ఆర్‌సీఓ కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించినట్లు వెల్లడించారు. అభ్యర్థులు జాబితాను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే ఈనెల 18లోగా కార్యాలయ పనివేళల్లో స్వయంగా సమర్పించాలని సూచించారు.
గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలలు(ఆర్‌జేసీ), ప్రతిభా కళాశాల(సీఓఈ)ల్లో 2026–27 విద్యాసంవత్సరం మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న గిరిజన విద్యార్థులు ఈనెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకు http:// tgrjc. cgg. gov. in,
www. tgtwgurukulam. telangana. gov. in వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఎంపికై న విద్యార్థులకు ఉచిత వసతితో పాటు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎప్‌సెట్‌కు నిష్ణాతులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సమీప గిరిజన గురుకులాల్లో సంప్రదించాలని పీఓ సూచించారు.
ముగిసిన ఫస్ట్ ఎయిడ్–ఫైర్ ఫైటింగ్ శిక్షణ
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల నుంచి వచ్చిన 34 మంది సెక్యూరిటీ సిబ్బందికి వారం రోజులపాటు జరిగిన 38వ బ్యాచ్ ఫస్ట్ ఎయిడ్–ఫైర్ ఫైటింగ్ శిక్షణా తరగతులు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా సెక్యూరిటి అధికారి ఎండీ.జాకీర్‌హుస్సేన్ మాట్లాడుతూ.. ప్రతీ యూనిఫాం సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్– ఫైర్ ఫైటింగ్‌పై అవగాహన కల్పించేందుకు సింగరేణి ప్రధాన ఆస్పత్రి, మైన్స్ రెస్క్యూస్టేషన్, ఫైర్ స్టేషన్ ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ అందించామన్నారు. తోటి వారు ఆపదలో ఉన్నప్పుడు, పని ప్రదేశాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే వాటిని నివారించి సింగరేణి ఆస్తులను పరిరక్షించాలో పూర్తిగా వివరించారు. అనంతరం శ్రీజ్యోతి అనాథ వృద్ధుల శరణాలయ నిర్వాహకులకు సెక్యూరిటీ సిబ్బంది చేత నిత్యావసర సరుకులను వితరణగా అందించారు. ఆతర్వాత శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఎం.పెద్దులు, డి.అజయ్‌లకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇన్‌స్పెక్టర్ డి.నారాయణరెడ్డి, సెక్యూరిటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
17న నందీశ్వరస్వామికి అభిషేక పూజలు
పాల్వంచరూరల్: మండల పరిధిలోని శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయ సముదాయంలోని శివాలయంలో ఈనెల 17 మంగళవారం మాఘమాస త్రయోదశిని పురష్కరించుకుని నందీశ్వరస్వామికి అభిషేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రదోషకాలంలో సాయంత్రం 5.30 గంటలకు నందీశ్వరస్వామికి పంచామృతాభిషేకం, అష్టోత్తర శతనామార్చన, మంత్రపుష్పం జరగనున్నట్లు చెప్పారు.


