సత్తుపల్లిరూరల్: మండలంలోని కిష్టారం మీదుగా సింగరేణి అధికారులు ప్రతిపాదించిన 32/11 కేవీ విద్యుత్ లైన్‌ను గ్రామస్తులు వ్యతిరేకించారు. గ్రామంలో సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి అప్పారావు ఆధ్వర్యాన శనివారం గ్రామసభ నిర్వహించగా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారుల గృహసముదాయాలకు 32/11 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించగా గ్రామస్తులు నిరాకరించారు. ఇప్పటికే సైలోబంకర్ కాలుష్యంతో ప్రాణాలు కోల్పోతుండగా, ఆ సమస్య ను పరిష్కరించకుండా మరో సమస్య తీసుకురావొద్దన్నారు. మూడు నెలల్లో సైలో బంకర్ సమస్యకు పరి ష్కారం చూపిస్తామని తమ దీక్షలు విరమింపచేసి, ఏడాది గడిచినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ బొగ్గు తవ్వకాలపై సింగరేణికి ఎంత అధికారం ఉందో, బాధితులను ఆదుకునే బాధ్యత అంతే కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అధికారులు గృహ సముదాయాలకు విద్యుత్ లైన్ ఏర్పాటులో ప్రజల నిర్ణయం మేరకే నడుచుకోవాలని సూచించారు. కాగా, సైలో బంకర్ సమస్యపై ఎమ్మెల్యే రాగమయి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సింగరేణి జేవీఆర్ ఓసీ పీఓ ప్రహ్లాద్, ఏఈ శరత్ తదితరులు పాల్గొన్నారు.


