బద్దుతండా సర్పంచ్‌కు తప్పిన ప్రమాదం
టేకులపల్లి: సీఎన్‌జీ కారు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా.. అందులో ఉన్న సర్పంచ్‌కు తృటిలో ప్రమాదం తప్పినట్లయింది. వివరాలిలా.. టేకులపల్లి మండలం బద్దుతండా సర్పంచ్ బాణోతు నరేష్ తన స్నేహితులతో కలిసి శనివారం టీజీ–28 1090 నంబర్ గల టాటా ఆల్ట్రో కారులో బొజ్జాయిగూడెం సమ్మక్క గద్దెల వద్ద ఓ శుభకార్యానికి వెళ్లి తిరుగు పయణమయ్యారు. ఈనేపథ్యాన కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోళ్లపాడు వైపు వెళ్లి కారుని రివర్స్ చేస్తున్న క్రమంలో కారు ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే కారులో ఉన్న సర్పంచ్, మరో ఇద్దరు కిందకు దిగి ఇల్లెందు ఫైర్‌స్టేషన్‌కు ఫోన్ చేయగా.. సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. కాగా అప్పటికే కారు అంతా దగ్ధమైంది.
యువతి అదృశ్యంపై
కేసు నమోదు
అశ్వారావుపేటరూరల్: ఓ యువతి అదృశ్యం కాగా, స్థానిక పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ యయాతీ రాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేట పట్టణ కేంద్రానికి చెందిన ఓ యువతి(19) శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తండ్రి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


