సూపర్‌బజార్(కొత్తగూడెం): భద్రాచలంలో ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీరామ నవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) సంస్థల సహకారం అవసరమని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం వివిధ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీసీ, నావా లిమిటెడ్, కేటీపీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సింగరేణి, టీజీ గ్రామీణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు గతంలో అందించిన సహకారం మాదిరిగానే ఈ సంవత్సరం అందించే సహాయంపై వివరించారు. నవమి వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలిరానుండగా.. వారికి తాగునీరు, అన్నదానం, వసతి, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాల కల్పన కోసం సీఎస్‌ఆర్ సంస్థలు సహకారం అందించాలని కోరారు. ఈక్రమాన దేవస్థానం ఈఓతో కావాల్సిన వివరాలను సేకరించాలని సీపీఓ సంజీవరావును ఆదేశించారు. అవసరాల మేరకు సీఎస్‌ఆర్ సంస్థల సహకారాన్ని సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, వివిధ సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


