పుష్కర ఘాట్లు పెంచుతాం | - | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్లు పెంచుతాం

Mar 14 2026 7:45 AM | Updated on Mar 14 2026 7:45 AM

భద్రాచలం: గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్యకు తగినట్లు ఘాట్ల సంఖ్య పెంచుతామని కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌, సబ్‌ కలెక్టర్‌ మ్రిణాల్‌ శ్రేష్టలతో కలిసి పుష్కరాల కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వాజేడు, వెంకటాపురం మధ్యలోని సుబ్బంపేట, మల్లేపల్లి గ్రామాల్లో గోదావరి ఘాట్లను నిర్మించాలని కోరారు. పరీవాహక ప్రాంతాల్లోని పురా తన, ఉపాలయాలను అభివృద్ధి చేయాలన్నారు. కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ భక్తులకు తగినట్లు ఘాట్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నా రు. రోడ్లకు మరమ్మతులు, కొత్తరోడ్ల నిర్మాణం చేపడతామని, సారపాక బ్రిడ్జి పక్కన ఘాట్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామని వివరించారు. భద్రాచలం వచ్చే అన్ని రూట్లలో విద్యుత్‌ దీపాలు అలంకరిస్తామని, కరకట్ట ఎత్తు కూడా పెంచుతామని పేర్కొన్నారు. అనంతరం గోదావరి కరకట్ట పక్కన ఉన్న డంపింగ్‌ యార్డ్‌ను పరిశీలించారు. డంపింగ్‌ యార్డ్‌ చెత్త వేస్తే జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆ తర్వాత సీతారామ కల్యాణం నిర్వహించే మిథిలా స్టేడియంలో ఏర్పాట్లపై దేవస్థానం ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు వెంకటేశ్వర్‌, నాగేశ్వరరావు, సంజీవరావు, వెంకటేశ్వర్లు, రవీందర్‌, ధనియాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్‌ సరఫరాపై పర్యవేక్షణ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో గ్యాస్‌ సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు శుక్రవారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్‌ సరఫరా పరిస్థితిపై సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ అంకిత్‌, అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌తో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించామని వివరించారు. పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్‌ కుమార్‌, పౌరసరఫరాల మేనేజర్‌ త్రినాథ్‌ బాబు పాల్గొన్నారు.

రుణాలకు దరఖాస్తు చేసుకోవాలి

షెడ్యూల్డ్‌ కులాల నిరుద్యోగ యువత రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ అంకిత్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఎస్సీ కార్యచరణ ప్రణాళిక–2025–26 ప్రకటించిందని పేర్కొన్నారు బ్యాంకు ద్వారా సబ్సిడీ రుణాల కోసం ఈవీ టూ వీలర్‌, ఈవీ త్రీ వీలర్‌, సోలార్‌ యూనివర్సల్‌ పంప్‌ కంట్రోల్‌ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాకు 276 యూనిట్లకు రూ.265.28 లక్షల సబ్సిడీతో అందించిచనున్నట్లు తెలిపారు. రూ. లక్ష వరకు 90 శాతం సబ్సిడీ, రూ 2 లక్షలకు 80 శాతం సబ్సిడీ, రూ 2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ, రూ.4 లక్షలు ఆపైన ఎంపిక చేసుకునే పథకాలకు 60 శాతం సబ్సిడీతో బ్యాంకుల ద్వారా రుణాలను అందజేస్తారని వివరించారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులను కలెక్టరేట్‌లోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

జనరల్‌ ఆస్పత్రిలో తనిఖీ

చుంచుపల్లి: కొత్తగూడెం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి లో కలెక్టర్‌ అంకిత్‌ శుక్రవారం తనిఖీ చేశారు. వైద్య సేవలు, సౌకర్యాలు, వైద్యసిబ్బంది పనితీరుపై ఆరాతీశారు. ఔషధాల నిల్వగదిని సందర్శించి మందుల స్టాక్‌ను పరిశీలించారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలనిఅధికారులను ఆదేశించారు. ఔట్‌ పేషెంట్‌ క్యూలైన్లను పరిశీలించి, ఓపీ సేవల వివరాలు తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చిన బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని చెప్పా రు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌, డాక్టర్‌ చైతన్య, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వసతి గృహాల నిర్వహణ మెరుగుపడాలి

పాల్వంచ: వసతి గృహాల నిర్వహణ పటిష్టంగా ఉండాలని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బొల్లేరుగూడెంలో బీసీ హాస్టల్‌ను ఆయన తనిఖీ చేశారు. బియ్యం, పప్పులు, నిత్యవసర సరుకులు, కూరగాయలు తదితర ఆహార పదార్థా నిల్వలను, రిజిస్టర్లను పరిశీలిచారు. సౌకర్యాలపై ఆరా తీశారు. అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. తహశీల్దార్‌ దారా ప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

గోదావరి పుష్కరాల సమీక్షలో

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement