ఇల్లెందు: పట్టణంలోని కొత్త కాలనీ 13వ వార్డుకు చెందిన హమాలీ మేసీ్త్ర ఉప్పరి సమ్మయ్య గురువారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సమ్మయ్య భార్య తార కథనం ప్రకారం... ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేశారంటూ తన భర్త సమ్మయ్యతోపాటు మరో ముగ్గురు హమాలీలను విధుల నుంచి తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన సమ్మయ్య ఆత్మహత్యకు యత్నించగా, కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి..
పాల్వంచరూరల్: కుటుంబ కలహాల కారణంగా శుక్రవారం ఓ వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని నాగారం కాలనీకి చెందిన బి.ప్రసాద్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్యాభర్తల కలహాలతో పురుగుల మందుతాగాడు. కుటుంబసభ్యులు గమనించి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.
టేకు కలప సీజ్
పినపాక: మండలంలోని భూపతిరావుపేట సమీపంలో గోదావరి తీర ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు టేకు మొద్దులను శుక్రవారం అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ.బయ్యారం రేంజర్ తేజస్వి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. టేకు మొద్దులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. జానంపేట డిప్యూటీ రేంజర్ వెంకటేశ్వర్లు, బీట్ ఆఫీసర్ శ్యామ్ తదితర అటవీ సిబ్బంది పాల్గొన్నారు.


